పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్​ కుట్ర : బండి సంజయ్​

పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్​ కుట్ర : బండి సంజయ్​

నిర్మల్/ కరీంనగర్, వెలుగు: టీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని కుట్రలు చేసినా భైంసా ప్రజల మనసుల్లోంచి తమను దూరం చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అన్నారు. ‘‘నేను భైంసా ఎందుకు పోకూడదు.. భైంసా పోవాల్నంటే వీసా ఉండాల్నా? సీఎం పర్మిషన్ తీసుకోవాల్నా?  భైంసా తెలంగాణలో లేదా..’’ అంటూ ఫైర్​ అయ్యారు. సోమవారం పాదయాత్రకు అనుకూలంగా  హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కరీంనగర్​లోని ఎంపీ ఆఫీసులో, ఆ తర్వాత నిర్మల్​జిల్లాలో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘భైంసాలో ఘర్షణలకు కారకులెవరో.. అమాయకుల ఉసురు తీసిందెవరో.. వంటి వివరాలు నేను పాదయాత్ర చేస్తే బయటకు వస్తాయని భయపడే నన్ను భైంసా వెళ్లకుండా సర్కారు కుట్ర చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు” అని తేల్చిచెప్పారు.

పాతబస్తీలో  భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తే జరగని అల్లర్లు భైంసాలో చేస్తే జరుగుతాయా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నదని, మజ్లిస్ నేతలు ఆడించినట్లు ఆడుతున్నదని మండిపడ్డారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకొని, వారికి భరోసా కల్పిస్తామని చెప్పారు. మొదట భైంసాలో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చి, తర్వాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి వరకు  నాలుగు విడతల్లో  ప్రజాసంగ్రామ యాత్ర చేశాం.. అన్ని చోట్లా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అందుకే  హైకోర్టుకు వెళ్లాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా పాదయాత్ర కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను అంతం చేసేందుకే యాత్ర చేపట్టామని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్తుంటే సీఎం కేసీఆర్​వాటిని పట్టించుకోకుండా ఫాంహౌస్​, ప్రగతి భవన్​కే పరిమితమైండు. పేదల కష్టాలను తెలుసుకునేందుకే మేము పాదయాత్ర చేపట్టాం. ఆ సమస్యలకు పరిష్కారాలను చూపేలా రాబోయే ఎన్నికల్లో మా పార్టీ మేనిఫెస్టో ఉంటుంది” అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కేసీఆర్​కు దమ్ముంటే ఫాంహౌస్​ నుంచి బయటికి వచ్చి ప్రజా సంగ్రామ యాత్రను చూడాలని ఆయన అన్నారు. 

సీఎం డైరెక్షన్​లోనే షర్మిల యాత్రపై దాడి

వరంగల్​ జిల్లాలో వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై జరిగిన దాడిని బండి సంజయ్​ ఖండించారు.  సీఎం డైరెక్షన్​లోనే షర్మిల పాదయాత్రపై దాడి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు  చేస్తున్నారని మండిపడ్డారు. 

అడెల్లి పోచమ్మకు పూజలు చేసి..

కరీంనగర్​ నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బండి సంజయ్ నిర్మల్ కు బయలుదేరారు. నిర్మల్​ జిల్లా సారంగపూర్​ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. కాగా, నిర్మల్​డీసీసీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్​ అడేల్లి పోచమ్మ ఆలయంలో బీజేపీ చీఫ్​ బండి సంజయ్​సమక్షంలో బీజేపీలో చేరారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కొద్ది దూరం వరకు బండి సంజయ్​ పాదయాత్ర చేశారు. అడేల్లి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కిరణ్​ గౌడ్​ ఇంట్లో సంజయ్​తో పాటు ఎంపీ అర్వింద్​ చాయ్​ తాగారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ తదితరులు పాల్గొన్నారు.  

ఇయ్యాల బీజేపీ బహిరంగ సభ

భైంసా, వెలుగు: బీజేపీ బహిరంగ సభ వేదికను భైంసా పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని సరస్వతి ఐటీ కాలేజీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి మార్చారు. భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల ఆవల సభ నిర్వహించుకోవాలని కోర్టు సూచించడం, ఇప్పటికే ఉన్న వేదిక పట్టణం నుంచి 2.8 కిలోమీటర్ల ఉండడంతో కొద్దిసేపు బీజేపీ లీడర్లు తర్జనభర్జన పడ్డారు. పోలీసుల అనుమతితో అదే వేదికను కొనసాగించాలని నిర్ణయించినా తర్వాత ఎందుకైనా మంచిదని మార్పు నిర్ణయం తీసుకున్నారు. మొదట పార్డి (బీ) వై జంక్షన్​ వద్ద సభా ఏర్పాట్లు చేయగా.. సోమవారం రాత్రి హుటాహుటిన అక్కడి నుంచి వేదిక, టెంట్లు ఎత్తివేసి, భైంసా నుంచి నిర్మల్ వెళ్లే రూట్​లో సరస్వతి ఐటీ కాలేజీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి షిఫ్టు చేశారు. మంగళవారం ఉదయం కల్లా ఏర్పాట్లు పూర్తిచేసి మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభ ప్రారంభిస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి.  కాగా.. సంజయ్​ సభకు చీఫ్ గెస్ట్​గా కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హాజరుకానున్నారు. మహారాష్ట్ర కేబినెట్ సమావేశాల కారణంగానే ఫడ్నవీస్ రాలేకపోతున్నారని సంజయ్ చెప్పారు. ఫడ్నవీస్​ స్థానంలో కిషన్​రెడ్డి సభకు వస్తారని తెలిపారు. 

ఇప్పటి వరకు  నాలుగు విడతల్లో  ప్రజాసంగ్రామ యాత్ర చేశాం.. అన్ని చోట్లా ప్రశాంతంగా, ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అందుకే  హైకోర్టుకు వెళ్లాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా 
పాదయాత్ర కొనసాగిస్తాం.
- బండి సంజయ్​