టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోంది

టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోంది

టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ సైతం అదే పనిగా కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు.  బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో ఆయన సమావేశమై మూడో విడుత ప్రజాసంగ్రామ యాత్రపై చర్చించారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత యాత్ర సాగనుంది. ఆగస్ట్ 2 నుంచి సుమారు 26 రోజుల పాటు 13 నుంచి14 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉద్యమాలతో బీజేపీకి ప్రజల్లో పేరొస్తుండటంతో ఓర్వలేని సీఎం కేసీఆర్..అదే సమయంలో కాంగ్రెస్ సైతం కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్ ను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. గతంలో బీజేపీ పక్షాన నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్ సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టిందని..నిర్మల్ లో బీజేపీ బహిరంగ సభ  నిర్వహించిన రోజే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ లోనూ పోటీగా సభ నిర్వహించిందని చెప్పారు.  తాజాగా బీజేపీ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆగస్టు 2న ప్రారంభించాలని నిర్ణయిస్తే..అదే రోజున కాంగ్రెస్ సిరిసిల్లలో రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తోందని విమర్శించారు. 

ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా భావిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్,కాంగ్రెస్ లు వేర్వేరు కావని.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థికి ఇరు పార్టీలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు మద్దతిచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పోటీ చేశాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.  రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనించి  టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ కోరారు.