ఉద్యోగులు కలవొద్దనే కేసీఆర్ పీఆర్సీ పాట

ఉద్యోగులు కలవొద్దనే కేసీఆర్ పీఆర్సీ పాట
  • వాళ్ల భుజాలపై తుపాకి పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చే కుట్ర
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
  • రాష్ట్రం లో సన్నాసుల పాలన నడుస్తోంది
  • దమ్ముం టే పీఆర్ సీపై ఉద్యోగులతో మీటింగ్ పెట్టి చెప్పాలె

పొలాల్లో ఉండాల్సిన రైతులు పాసు పుస్తకాల కోసం తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నరు. స్టేషన్ లో ఉండాల్సిన పోలీసులు తహసీల్ ఆఫీసులు, బస్టాండ్ల దగ్గర, రోడ్లపై డ్యూటీలు చేస్తున్నరు . బస్ స్టేషన్లలో ఉండాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపై ఆందోళన చేస్తున్నరు . తహసీల్ లో డ్యూటీలు చేయాల్సిన రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నరు .సెక్రటేరియట్ లో ఉండాల్సిన సీఎం ఫాంహౌజ్ లో ఉంటున్నరు. సెక్రటేరియట్ లో పని చేయాల్సిన మంత్రులు తామే ఓనర్లమని కొం దరు, కిరాయిదారులమని ఇంకొం దరు కొట్టుకుంటున్నరు . రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది. – కె. లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల భుజంపై తుపాకి పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రెవెన్యూ ఉద్యోగులకు పీఆర్సీ అంటూ లీకులిస్తున్నారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకు రెవెన్యూ ఉద్యోగులు తోడైతే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని, రాజకీయంగా పుట్టగతులుండవనే కేసీఆర్ పీఆర్సీ పాట పాడుతున్నారని విమర్శించారు. నిజంగా వాళ్లకు పీఆర్సీ ఇవ్వాలనుకుంటే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి ఇస్తున్నట్లు ప్రకటించాలని, సీఎంకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ ఇవ్వాలని ఏడాది కిందే నివేదిక సిద్ధమైందని, ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు రెవెన్యూ ఉద్యోగులను దూరం పెట్టేందుకే పీఆర్సీని ముందుకు తెచ్చారని విమర్శించారు. ఇన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే స్పందించని మంత్రి కేటీఆర్, రెవెన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రమాదమని గుర్తించి చర్చలు జరుపుతున్నారని అన్నారు.

ఆత్మహత్యల్లో పైపైకి

ఆత్మహత్యల పునాదిగా ఏర్పడ్డ రాష్ట్రంలో, ఇప్పుడు ఆత్మహత్యల్లోనే రికార్డు నెలకొల్పుతోందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల్లో  దేశంలో తెలంగాణ మూడో స్థానంలో, అవినీతిలో రెండో స్థానంలో ఉన్నాయన్నారు. ఆరేళ్లలో 3 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ తానో గొప్ప ఇంజినీర్​నని, దార్శనికుడినని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇతరులను సన్నాసులని కేసీఆర్ విమర్శిస్తుంటారని, ఇప్పుడు రాష్ట్రంలో సన్నాసుల పాలన సాగుతోందని చురకలంటించారు. రెండోసారి ప్రధాని అయిన మోడీ గ్రాఫ్ పెరుగుతుంటే, రెండో సారి సీఎం అయిన కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందన్నారు.

రాహుల్​.. ఇకనైనా జాగ్రత్త

రాఫెల్ పై రాహుల్ ఆరోపణలు తప్పని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని లక్ష్మణ్ స్వాగతించారు. మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో మరోసారి తన నిజాయితీని చాటుకున్నట్లయిందన్నారు. ఈ తీర్పుతోనైనా బట్ట కాల్చి మీదేసే బుద్ధిని కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. రాహుల్ ఇక తన నోటిని అదుపులో ఉంచుకోవాలన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జఠిల సమస్యలను సామరస్యంగా, రక్తం బొట్టు చిందకుండా పీఎం పరిష్కరిస్తున్నారని చెప్పారు.

బీజేపీలో చేరికలు

ములుగు జిల్లాకు చెందిన ఆదివాసి నాయకుడు కృష్ణతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు గురువారం లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో  ఎంపీ గరికపాటి మోహన్ రావు, పార్టీ నేతలు సుభాష్, చింతా సాంబమూర్తి, సుధాకర్ శర్మ, మల్లారెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ మంచి భవిష్యత్తు: కేంద్ర మంత్రి సారంగి

రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, పార్టీ నేతలు కష్టపడి పని చేయాలని కేంద్ర మైక్రో, మీడియం ఎంటర్ ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి సూచించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సారంగి గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని లక్ష్మణ్ సన్మానించారు. దక్షిణాదిలో బీజేపీ బలం పుంజుకుంటోందని, రాష్ట్రంలో మరింత వేగంగా బలోపేతమవుతోందని మంత్రి చెప్పారు. కేంద్ర నిధులను కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు దారి మళ్లిస్తున్నాయని, వాటిని రాష్ట్రాలు సరిగా ఖర్చు పెట్టేలా పార్టీ నేతలు దృష్టిసారించాలని సూచించారు. కాగా శబరిమలపై రివ్యూ పిటిషన్‌‌ను ఏడుగురు జడ్జీల బెంచ్ కు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు గురువారం అన్నారు. మహిళల హక్కులు, వారి భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

టీఆర్​ఎస్ నేతలు రగిలిపోతున్నరు

అధికార టీఆర్ఎస్​లో చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. రాజులుగా బతికినోళ్లం, బానిసలుగా మారామని మథనపడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు అవినీతి పాలన తోడై విసుగెత్తిన చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. దీంతో రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయని, బీజేపీ ఓవర్ లోడ్​లో ఉందని చెప్పారు.

BJP state president Laxman lashed out on CM KCR