తెలంగాణలలో బీజేపీ టార్గెట్ 10 సీట్లు

తెలంగాణలలో బీజేపీ టార్గెట్ 10 సీట్లు

హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. ఆదివారం లోక్ సభ ఎన్నికల కమిటీలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి సునీల్ బన్సల్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జిలు, మాజీ ప్రజా ప్రతినిధులతో పార్టీ సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్​చార్జి అర్వింద్ మీనన్ లు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి10 సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో చర్చించారు. 

రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే ప్రధాని మోదీ సభలు రెండు నిర్వహించడంపై చర్చ సాగింది. ఆదిలాబాద్ లో ఒకటి, భువనగిరి – మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల్లో మరొకటి నిర్వహించడంపై చర్చ సాగినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవల నియమించిన సుమారు10 కమిటీల బాధ్యతలు, బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను  తీసుకెళ్లడంపైనే జాతీయ నేతలు దిశా నిర్దేశం చేశారు. లోక్ సభ అభ్యర్థుల ప్రకటన ముందుగానే ఉండాలని, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా చివరి వరకు పెండింగ్ పెట్టడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బాటలు వేసేలా చూడాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మళ్లీ పాదయాత్ర కొనసాగిస్తే.. ఎలా ఉంటుందని తరుణ్ చుగ్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది.

శాసన సభాపక్ష నేత  ఎంపికపై అభిప్రాయ సేకరణ

బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపికపై సోమవారం పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ ఇన్​చార్జి తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.. 8 మంది ఎమ్మెల్యేల అభిప్రా యాన్ని తెలుసుకున్నారు. వారి అభిప్రా యాలను పార్టీ చీఫ్​ నడ్డాకు వివరించి, ఆ తర్వాతనే ఎల్పీ నేతను ప్రకటించనున్న ట్లు సమాచారం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి పేరును ప్రపోజల్ చేయగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.