అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం : రాంచందర్ రావు

అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం :  రాంచందర్ రావు
  • రైతు భరోసా, మూసీ ప్రక్షాళనపై సర్కారును నిలదీస్తం   బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. ఆదివారం పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ శాసనసభ, శాసన మండలి పక్షం (బీజేఎల్పీ) సమావేశమైంది. ఈ సందర్భంగా  అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 

రైతు భరోసా, నిరుద్యోగ సమస్యలు, హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని నిర్ణయించారు. మూసీ ప్రక్షాళనలో జరుగుతున్న పరిణామాలు, ఖమ్మం భూదాన్ భూముల సమస్య, విద్యా కమిషన్ నివేదిక వంటి అంశాలను సభలో లేవనెత్తాలని డిసైడ్ అయ్యారు. 

నిరుద్యోగుల సమస్యలు, గత బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన జాప్యంపై సర్కారును ప్రశ్నించాలని తీర్మానించారు. జీహెచ్‌‌ఎంసీ సమస్యలు, విలీనంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి,  ఎమ్మెల్యేలు రాకేశ్‌‌ రెడ్డి, ధన్‌‌పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, వివిధ కారణాలతో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌‌ బాబు, రామారావు పటేల్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

విద్యను గాలికొదిలేశారు: మల్క కొమరయ్య 

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆరోపించారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్‌‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్ల తరఫున సభలో గొంతు వినిపిస్తానని చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, దీంతో టీచర్లకు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. జీహెచ్‌‌ఎంసీని మూడు భాగాలుగా విభజించడం వెనక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. మద్దతుదారులతో కలిసి గౌడ సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత పంజాల గిరిధర్ గౌడ్.. తమ అనుచరులతో కలిసి న్యాయవాది కవిత, పృథ్వీరాజ్ ఆదివారం బీజేపీలో చేరారు. వారికి నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనపై నమ్మకంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్​నగర అభివృద్ధి కుంటుపడిందని, పారదర్శకమైన పాలన అందాలంటే బీజేపీ నాయకుడే మేయర్‌‌‌‌గా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ పాల్గొన్నారు.