పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ విస్తారక్ ల సమావేశానికి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని శామీర్ పేట లియోనియో రిసార్ట్ లో రేపటి నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వర్చ్యువల్ గా పార్లమెంట్ నియోజకవర్గాల విస్తారక్ ల సమావేశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. ఎల్లుండి జరుగనున్న ముగింపు సమావేశానికి పార్టీ ఆర్గనైజింగ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ రానున్నారు.
మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 92 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన విస్తారక్ లు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు అదనంగా అండమాన్ నికోబార్, లక్షద్వీప్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల విస్తారక్ లు కూడా రానున్నారు. వీరికి దిశానిర్దేశం చేసేందుకు ఢిల్లీ నుంచి ఆరుగురు పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీలు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఈ సమావేశాలకు అటెండ్ కానున్నారు.

