రాహుల్, సోనియాపై కేంద్రం కుట్ర

రాహుల్, సోనియాపై కేంద్రం కుట్ర

బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుండి ఏవిధంగా పారద్రోలామో..అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కుల్చుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోందని మండిపడ్డారు. గతంలోనే మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును..కావాలని  మళ్ళీ ఓపెన్ చేశారని భట్టి ఆరోపించారు.  కాంగ్రెస్ పై కుట్ర పూరితంగానే సోనియా, రాహుల్ కు  బీజేపీ ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ది అని చెప్పారు. కాంగ్రెస్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చిందని తెలిపారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా.. దేశ అభ్యున్నతి కోసం పనిచేశారని భట్టి గుర్తు చేశారు.  రాహుల్, సోనియాకి మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ అనేది మల్టీ నేషనల్ కంపెనీ లాంటి పార్టీ అని భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను తమకు కావలసిన వాళ్ళకి అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేమిద్దరం, మాకిద్దరు అన్నట్లుగా మోదీ అమిత్ షా , అదానీ అంబానీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో  ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారని..నిరాశతో యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉందని చెప్పారు. ఈ సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పై ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. తాము చేపట్టిన  నిరసన దీక్ష కేవలం సోనియా, రాహుల్ కోసమే కాదన్న ఆయన... కోట్లాది ప్రజల కోసమని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం గ్రామాలకు వెళ్తామని.. ఇంటింటికి వెళ్లి బీజేపీ కుట్రలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.