కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలే ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించిన్రు : గంగుల

కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలే ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించిన్రు : గంగుల

తొమ్మిదేళ్లలో ఎన్నో పరీక్షలు నిర్వహించాం కానీ ఎప్పుడూ పేపర్ లీక్ లాంటి చిన్న సంఘటన జరగలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండడంతో తెలంగాణపై విషం కక్కేవారి నిజ స్వరూపం బయటపడుతోందని, ప్రభుత్వాన్ని  అభాసుపాలు చేయాలని చూస్తున్నారని, దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి ‌సంజయ్ ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. బండి‌సంజయ్ ప్రోత్సాహంతోనే ఈ అలజడి చేలరేగిందన్న ఆయన.. కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలే ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు చేశారు. కేవలం బీజేపీ గ్రూపుల్లో మాత్రమే ప్రశ్నపత్రం‌ వచ్చిందని విమర్శించారు. బీజేపీకి జెండా పట్టె కార్యకర్తలు లేకనే ఇలా లీకులు చేసి బీజేపి వైపు తిప్పికుంటున్నారంటూ గంగుల మండిపడ్డారు.

అశాంతి, అలజడులు రేపి రాష్ట్రాన్ని మరో బిహార్ లాగా చెయ్యాలని బండి సంజయ్ చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం  భవిష్యత్తుతరాలకి ఆదర్శంగా నిలవాలని చూస్తుంటే బండి‌సంజయ్ అలజడులు సృష్టిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకుల వ్యవహారం అంతా కరీంనగర్ చుట్టే తిరుగుతుందని, నోటిఫికేషన్  వచ్చి ఉద్యోగాలు వస్తే బీజేపీ జెండా పట్టుకునే వారు ఉండరని‌ కుట్రలు చేస్తున్నారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి రావాలని లీకులు చేసి నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ఎంత పెద్దవారి హస్తం ఉన్నా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం‌ తరుపున‌ చర్యలు తప్పవన్న మంత్రి గంగుల.. విద్యార్థులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యార్థులు అగం‌ కావద్దని, 2,3  రోజుల్లో అందరి బండారం బట్టబయలు అవుతుందని స్పష్టం చేశారు. చెట్టు మీద నుండి దూకి ప్రశ్నపత్రం పోటో తీశారని,పేపర్ లీక్ కాలేదని చెప్పారు. పచ్చగా ఉన్న తెలంగాణలో కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ వాట్సాప్ గ్రూపులో మాత్రమే పేపర్ పోస్ట్ చేశాడని, బండి‌ సంజయ్ కి వందలసార్లు ప్రశాంత్  ఎందుకు పోన్ చేశాడని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గులు చేయవట్టే ప్రభుత్వం అభాసుపాలు అవుతోందని చెప్పారు. కమలాపూర్ ఘటన వందశాతం ప్రీప్లాన్ ఘటనేనని ఆయన ఆరోపించారు.