పార్టీలో మార్పులపై బీజేపీ ఫోకస్.. ఒపీనియన్స్ సేకరిస్తున్న హైకమాండ్

 పార్టీలో మార్పులపై బీజేపీ ఫోకస్.. ఒపీనియన్స్ సేకరిస్తున్న హైకమాండ్

హైదరాబాద్, వెలుగు :  పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక, పార్లమెంట్ సమావేశాలు ముగియగానే తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులను చేపట్టాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లను గెలుచుకుంది. ఈసారి డబుల్ డిజిట్ సీట్లను చేజిక్కించుకునేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలను మార్చడంపై  దృష్టి పెట్టినట్టు సమాచారం.   

బాధ్యతలు ఎవరికి..?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పదవిలో తాను ఉండనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో  రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే దానిపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తున్నది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ..ఈ ముగ్గురిలో ఎవరి నాయకత్వానికి తెలంగాణ జనం మద్దతు ఉంటుందనే దానిపై రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు కీలక నేతల ఓటమికి కారణం ఏమిటి?  ఈ నేతల సామాజిక వర్గం ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే దానిపై కూడా  వివరాలు సేకరిస్తున్నది .  రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీగా  ఉన్న ప్రకాశ్ జవదేకర్, కో ఇన్ చార్జీ గా ఉన్న సునీల్ బన్సల్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జీగా ఉన్న తరుణ్ చుగ్ లను కూడా చేంజ్ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఏ వ్యూహం బెటర్..?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హిందుత్వ నినా దంపై వెళ్లడమా..లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో వలె బీసీ, ఎస్సీ  సామాజికవర్గం నినాదంతో వెళ్లాలా అనే దానిపై కూడా హైకమాండ్ ఆరా తీస్తోంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మీకే ఓటు వేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థులకు పలు చోట్ల జనం హామీ ఇచ్చినట్లు  రాష్ట్ర నేతలు జాతీయ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తెలం గాణ జనం పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని బలపరిచేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలు ఢిల్లీ పెద్దలకు వెళ్లాయి. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని బీజేపీ నిర్ణయించింది.