హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రజా పాలన కాదని..ఇది రజాకార్ల పాలనని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒవైసీ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పండిట్ దీనదయాళ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి బీజేపీ కార్యకర్తకు మార్గదర్శకాలన్నారు.
పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతి కార్యకర్తకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. దీనదయాళ్ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం.. అంత్యోదయ సిద్ధాంతాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలని సూచించారు. సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ఆ మహనీయుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పేదరిక నిర్మూలనకు, సామాజిక సమానత్వానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒవైసీ చెప్పినట్లు పాలన జరుగుతున్నదని ట్వీట్ చేశారు.
