
- అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు
- కేటీఆర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
- డిఫాల్ట్ రైస్‌మిల్లర్లు ఎవరి అనుచరులో అందరికీ తెలుసు
- మా సర్కారు వచ్చినంకే అవినీతిపరులపై కేసులు పెడ్తున్నం
- మేం సన్నబియ్యం కొననేలేదు.. అప్పుడే స్కామ్ జరిగిందా?
- ప్యాడీ లిఫ్ట్ అయ్యిందే రూ. 200 కోట్లు.. వెయ్యికోట్ల స్కామ్ ఎట్ల జరిగింది?
- వడ్ల ఓపెన్ వేలంతో 1,100 కోట్ల అదనపు ఆదాయం తెచ్చినం
- కేంద్రీయ బండార్ సంస్థను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించింది గత సర్కార్ కాదా?
- రూ.42కు కిలో సన్న బియ్యం ఎక్కడ దొరుకుతున్నయ్?
- కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు తాము రెడీ అని సవాల్
- కంపెనీలపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: మిల్లర్లకు దోచిపెట్టినోళ్లే తమపై నిందలు వేయడం సిగ్గుచేటని, డిఫాల్టర్ మిల్లర్లతో కుమ్మక్కై తమపై ఆరోపణలు చేస్తున్నారని సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా మిల్లర్లకు రూ.20 వేల కోట్ల ధాన్యం ఇచ్చి, దోపిడీకి కారణమైన ఆ పార్టీ నేతలు.. అక్రమార్కుల భరతం పడ్తున్న తమపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మిల్లులు, గోదాముల్లో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, కరీంనగర్ లో వేణుగోపాల్ , సూర్యాపేట లో సోమ నర్సయ్య లాంటివాళ్లు వందల కోట్ల విలువైన వడ్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని, ఇలాంటి రైస్మిల్లర్లంతా ఎవరి అనుచరులో అందరికీ తెలుసని ఉత్తమ్ అన్నారు.
మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కారు ఇప్పటివరకు సన్నబియ్యం గింజ కూడా కొననప్పటికీ రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని కేటీఆర్ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. వాళ్ల ఆరోపణల్లో నయా పైసా వాస్తవం లేదని, అన్నీ అబద్ధాలే ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఎవరు ఎన్ని వేషాలు వేసినా వందల కోట్ల ప్రభుత్వ సొమ్మును దగ్గరపెట్టుకున్న రైస్ మిల్లర్ల భరతం పట్టడం ఖాయమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘వడ్ల కొనుగోళ్లపై కొన్ని రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక సివిల్ సప్లై పై రివ్యూ చేస్తే బీఆర్ఎస్సర్కారు చేసిన బాగోతం బయటపడ్డది. గత పదేండ్లలో సివిల్సప్లై శాఖలో రూ.58 వేల కోట్ల అప్పులు చేసి, రూ.11 వేల కోట్ల నష్టాన్ని మూటగట్టి ఇచ్చిన్రు.
సివిల్ సప్లై లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, ఢిల్లీకి వందల కోట్లు పంపామని కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నరు. కానీ మా ప్రభుత్వం వచ్చాక వడ్లను ఓపెన్ టెండర్ లో వేలం వేస్తే రూ. 1100 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది’’ అని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్యాంక్ గ్యారంటీ, హామీ పత్రాలు తీసుకోకుండా రూ.20 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారని, కానీ వాళ్ల నుంచి బియ్యం మాత్రం సేకరించలేదని పేర్కొన్నారు. ‘మీ పాలనలో గాడి తప్పిన సివిల్ సప్లై శాఖను గడిచిన 3 నెలల నుంచి సెట్ చేస్తున్నాం. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం.
మీ హయాంలో వడ్లు తీసుకొని లెవీ పెట్టకుండా బయట అమ్ముకున్న 43 మంది రైస్ మిల్లర్ల మీద కేసులు పెట్టి డిఫాల్టర్ల లిస్ట్ లో చేర్చినం. 30 ఏండ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఇప్పటి వరకు రైస్ మిల్లర్లపై ఇంత కఠినంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. ఇంత వరకు అసోసియేషన్ గా వస్తే తప్ప నేను రైస్ మిల్లర్లను కలవలేదు. అలాంటి నామీద ఆరోపణలు చేస్తారా?” అని కేటీఆర్‌ను మంత్రి ఉత్తమ్ నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ చుట్టూ చేరిన కొందరు డిఫాల్టర్ రైస్ మిల్లర్లు వారితో ఇలా మాట్లాడిస్తున్నారని విమర్శించారు.
ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్న వ్యక్తి కూడా ఆరోపణలు చేయడమా?
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి రాజకీయ అనుభవం లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఫ్లోర్‌లీడర్ పదవి కొనుక్కున్న వ్యక్తికూడా తనపై ఆరోపణలు చేయడమా? అని ప్రశ్నించారు. “మేం గత ప్రభుత్వం కంటే ముందే వడ్లు కొన్నం. రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినం. తడిసిన వడ్లు కూడా కొనాలని మొన్న కేబినెట్లో నిర్ణయించినం. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినం.
గతంతో పోలిస్తే ఇపుడు తరుగు తక్కువగా తీస్తున్నరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ సిస్టమ్ అమలు కావడం లేదు” అని పేర్కొన్నారు. మహేశ్వర్‌రెడ్డి మీడియా ముందు వడ్ల విషయం మాట్లాడి.. లోపల భూముల సెటిల్ మెంట్ గురించి చర్చిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. ఆయన ఆ పార్టీ చీఫ్ కిషన్‌రెడ్డిని దాటి ముందుకు పోవాలని ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఉత్తమ్ చురకలంటించారు.
సివిల్ సప్లై శాఖను ఆగం పట్టిచ్చిన్రు
సివిల్ సప్లై శాఖను గత బీఆర్ఎస్ సర్కార్ ఆగం పట్టిచ్చిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కారు ఇంతవరకూ ఎలాంటి సన్న బియ్యం కొనలేదని, కానీ వాటి టెండర్లలో రూ.300 కోట్లు కమీషన్లు తీసుకున్నట్లు, అందులో ఢిల్లీకి రూ.100 కోట్లు పంపినట్లు కేటీఆర్ తమను బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము ఇంతవరకు రూ.200 కోట్ల విలువైన వడ్లు మాత్రమే కొన్నామని, అందులో వెయ్యి కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. తాను ఇంతవరకూ రైస్ మిల్లర్లనే కలువలేదని చెప్పారు.
‘‘కేంద్రీయ బండార్ అనే సంస్థను మేం బ్లాక్‌లిస్టులో పెడ్తే దానిని బ్లాక్ లిస్టులోంచి తీసేసి టెండర్ ఇచ్చారు”అని కేటీఆర్ అంటున్నారని, అసలు తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి కేంద్రీయ బండార్ బ్లాక్ లిస్ట్ లోనే లేదని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బ్లాక్‌లిస్టులో పెట్టి, మళ్లీ తొలగించారని చెప్పారు. కేటీఆర్, మహేశ్వర్‌రెడ్డి కలిసి సన్నబియ్యం కిలో రూ.42కి ఇస్తే కొనేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉన్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.