హైదరాబాద్, వెలుగు: రక్తదానం మహాదానమని, ఒక వ్యక్తికి ప్రాణదానం చేయడం కంటే గొప్ప దానం మరొకటి లేదని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో భారత రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రక్తదానం కేవలం వైద్య సాయం మాత్రమే కాదని, అది మానవత్వానికి, కరుణకు, సామాజిక బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఆయన స్వచ్ఛంద రక్తదాతల సేవలను అభినందించారు.
స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చే దాతలు నిజమైన హీరోలని అన్నారు. ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ ‘‘వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ – గివ్ బ్లడ్, సేవ్ లైవ్స్’’ మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. రక్తదానానికి కృషి చేస్తున్న రెడ్‌క్రాస్ ప్రతినిధులు, వైద్య సిబ్బందిని అభినందించారు. తెలంగాణను క్షయ (టీబీ), మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, యువత, పౌర సమాజం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విశిష్ట సేవలకు పురస్కారాలు
వైద్యులు, రక్తదాతలు, శిబిరాల నిర్వాహకులు, రెడ్‌క్రాస్‌కు సహకారం అందించిన సంస్థల ప్రతినిధులకు గవర్నర్ పురస్కారాలు అందజేశారు. అందులోభాగంగా రక్తదానం పట్ల సమాజంలో చైతన్యం కలిగిస్తూ విశిష్ట సేవలందించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చైర్మన్ డా. ఎస్.ఎం. రాజేశ్వర్‌రావును గవర్నర్ సత్కరించి, పురస్కారం అందజేశారు. స్వచ్ఛంద రక్తదానోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో, అవగాహన కల్పించడంలో రాజేశ్వర్‌రావు చేస్తున్న కృషికి ‘‘హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు-2026’’ దక్కింది. ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీని గవర్నర్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో సుమారు 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
