బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎక్కువగా ఎలాంటి వ్యాధులకు చికిత్సల కోసం వస్తున్నారని ఆరా తీశారు.
ఆస్పత్రిలోని ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు సేవలు అందుబాటులో ఉన్నందున మరో గైనకాలజిస్టును నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. అత్యవసరం అయితేనే రోగులను నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని సూచించారు.
