- మిల్లర్లకు నూక శాతం డబ్బులు ఇవ్వని ప్రభుత్వం
- చెల్లించాల్సినవి మొత్తం రూ.1350 కోట్ల వరకు!
- ఏడాదైనా నూకశాతం తేల్చలె.. సీఎస్కమిటీ రిపోర్ట్ఇయ్యలె
హైదరాబాద్, వెలుగు: బాయిల్డ్ రైస్ వివాదం నేపథ్యంలో నూకలు ఎక్కువ వస్తే ఆ మేరకు నష్టాన్ని భరిస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఏడాది అవుతున్నా ఆ లాస్‌ను భరించలేదు. కనీసం నూకశాతం ఎంత అనేది కూడా తేల్చలేదు. దీంతో సర్కారు నుంచి నష్టం డబ్బులు రాక మిల్లర్లు ఈయేడు ధాన్యంపై ఇష్టానుసారంగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిరుడు కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే తీసుకుంటామని తెగేసి చెప్పింది. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ చేస్తే యాసంగి వడ్లకు నూకలు ఎక్కువ అవుతాయని మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిల్లింగ్ నూక నష్టం తామే భరిస్తామని రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చి ధాన్యం మిల్లింగ్‌కు పంపించింది. కానీ ఏడాదైనా ఇప్పటికీ నూకశాతం తేల్చలేదు. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎఫ్ఎఆర్ఎస్ఐ) క్వింటాల్‌కు రూ.270 నష్టం వస్తుందని అంచనా వేసింది. సర్కారు ఆ రిపోర్టును బయటపెట్టకుండా.. నిర్ణయాన్ని ప్రకటించలేదు. మిల్లింగ్ నష్టం చెల్లించక పోవడంతో మిల్లర్లు ఆ నష్టాన్ని రైతులపై భారం వేస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
నిరుటి మిల్లింగ్ నష్టం రూ.1350కోట్లు
నిరుడు సివిల్ సప్లయ్స్ 2021–22 యాసంగిలో సేకరించిన వడ్లు 50.39లక్షల టన్నులు మిల్లింగ్ చేసి 34.07లక్షల టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో నూకశాతం నష్టం క్వింటాల్‌కు రూ.270 రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంది. సేకరించిన 50 లక్షల టన్నులకు దీన్ని భరించాల్సి వస్తే రూ.1350 కోట్ల వరకు సర్కారు మిల్లర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈయేడు మళ్లీ యాసంగి వడ్లు సర్కారు మిల్లులకు పంపుతోంది. కానీ మిల్లింగ్ నష్టం భరించే విషయంపై ఎటూ తేల్చలేదు. దీంతో మిల్లర్లు ధాన్యంపై అడ్డగోలు కోతలు పెడుతూ ఆ భారం రైతులపై వేస్తున్నారు.
ఈయేడు ప్రస్తావనే లేదు
ఈయేడు యాసంగిలో నూక నష్టం భరించడంపై రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో యాసంగిలో వడ్లపై మిల్లర్లు ఎక్కువ కోతలు పెడుతున్నారు. రైతులకు క్వింటాల్‌కు మూడునాలుగు కిలోల దాకా కోత పడుతున్నది. ఇది లారీ లోడుకు నాలుగైదు బస్తాలు అవుతున్నది. మిల్లుల దగ్గర రోజుల తరబడి దింపుకోకుండా ఇష్టానుసారంగా కోతలు పెడుతూ రైతులను ముంచుతున్నరు.
నష్టంపై రాష్ట్ర సర్కారు చేతులెత్తేసినట్లేనా?
యాసంగిలో నూకశాతంపై తేల్చాలని రాష్ట్ర సర్కారు సీఎస్‌ను గత 2022 మే లో ఆదేశించింది. సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసింది. సీఎస్ కమిటీ నూక శాతం బాధ్యతను మైసూర్‌కు చెందిన సీఎఫ్ టీఆర్ఐకి అప్పగించింది. సీఎఫ్ టీఆర్ఐ శాస్తవేత్తలు మిల్లుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఎంపిక చేసిన మిల్లుల్లో రెండు రకాల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పరీక్షించారు. తర్వాత మైసూరులోని సీఎఫ్ టీఆర్ఐ లో పరీక్షించేందుకు శాంపిల్స్ తీసుకెళ్లనున్నారు. అక్కడ వీటిని మిల్లింగ్ చేసి, ఇక్కడి మిల్లుల్లో మిల్లింగ్ చేసిన ధాన్యంతో పోల్చి నూకశాతాన్ని లెక్కించారు. కొన్ని ప్రాంతాల్లో 50/50శాతం, కొన్ని ప్రాంతాల్లో 40/60శాతం, కొన్ని ప్రాంతాల్లో 60/40శాతం గా తేల్చారు. యావరేజీగా క్వింటాల్‌కు రూ.270 వరకు నష్టం అంచనా వేశారు. కానీ సీఎస్కమిటీ రా రైస్ మిల్లింగ్‌లో నూకశాతం తేల్చి రాష్ట్ర సర్కారుకు ఎంత భారం పడుతుందో నిర్ధారించి ప్రకటించలేదు. సీఎఫ్ టీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినా సీఎస్ కమిటీ ఏడాదిగా ఎటూ తేల్చలేదు. ఇది తేలితే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత లాస్ భరిస్తుందనేది స్పష్టత వస్తుంది. అయితే ఈ విషయంలో ఇన్నాళ్లు ఏమీ తేల్చకపోవడంతో సర్కారు చేతులెత్తేసినట్లేనని తెలుస్తున్నది.

