న్యూఢిల్లీ: 2011 వరల్డ్ కప్ జట్టు నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇప్పటికీ తనను బాధిస్తోందని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ఈ విషయంలో గతేడాది రోహిత్‌కు క్షమాపణలు కూడా చెప్పానని తెలిపాడు. జట్టు సమతుల్యత కోసమే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ‘1983 వరల్డ్ కప్ గెలిచిన నాటి వ్యూహాన్ని 2011లో కూడా అమలు చేయాలని మేం భావించాం.
టీమ్ బ్యాలెన్స్ కోసం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు రోహిత్‌ను ఎంపిక చేయలేకపోయాం. ఈ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇండియా టైటిల్ గెలవడంలో ఆల్‌రౌండ్ ప్రతిభ నిర్ణయాత్మకంగా నిలిచిందన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరు? బంతి, బ్యాట్‌తో యువరాజ్ సింగ్ అద్భుతంగా రాణించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా బౌలింగ్ కూడా చేశారు. యూసఫ్ పఠాన్ కూడా ఒక హాఫ్ ఆల్‌రౌండర్. వాస్తవానికి 2011 వరల్డ్ కప్‌లో ఆడేంత సామర్థ్యం రోహిత్‌కు ఉంది. కానీ ఆల్‌రౌండర్ల విధానం వల్లే రోహిత్‌ను మిస్సయ్యాం’ అని శ్రీకాంత్ వివరించాడు.

