హైదరాబాద్: స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌లో లేనప్పుడు కూడా అతని పరిణతిపై ఎలాంటి సందేహాలు లేవని సన్‌రైజర్స్ బౌలింగ్‌లో వరుణ్ ఆరోన్ అన్నాడు. అభిషేక్ పదునైన క్రికెటింగ్ ఆలోచన విధానాన్ని ప్రశంసించాడు. రిస్క్ ఎక్కువగా ఉండే ఆటతీరును ప్రదర్శించినప్పుడు కొన్నిసార్లు విఫలం కావడం సహజమేనన్నాడు. ‘అభిషేక్‌కు ఎప్పట్నించో పరిణతి ఉంది. గత కొన్నేళ్లుగా ఇది కనిపిస్తూనే ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ నంబర్‌వన్ టీ20 బ్యాటర్ కావాలంటే అపారమైన పరిణతి ఉండాలి.
పిచ్ పరిస్థితులను అంచనా వేసి బ్యాటింగ్ చేయడం అతని ప్రత్యేకత. ఆరంభంలో జాగ్రత్తగా ఆడి తర్వాత దూకుడును చూపెట్టడం పదునైన క్రికెటింగ్ విధానం. ప్రతి బంతిని స్వేచ్ఛగా ఆడటానికి పిచ్ అనుకూలంగా లేదు. కాబట్టి ప్రత్యర్థిని, వికెట్‌ను గౌరవించాలి. అభిషేక్ అదే చేసి సక్సెస్ అయ్యాడు’ అని ఆరోన్ వివరించాడు. యంగ్ పేసర్ షకీబ్ హుస్సేన్, ఈషాన్ మలింగ చూపెట్టిన వైవిధ్యాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు. ‘ఇద్దరి బౌలింగ్‌లో చాలా ప్రత్యేకత ఉంది. మలింగ బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. మ్యాచ్ 11, 12వ ఓవర్‌లో అది కనిపించింది. తెల్ల బాల్‌పై మెరిసే వైపు ఎక్కడ ఉందో సరిగ్గా చూడలేం. షకీబ్ యార్కర్లు, స్లో బాల్స్ వేయగలడు. ఆఫ్ స్పిన్నర్ రాబట్టగలిగే టర్న్ తీసుకొస్తాడు’ అని ఆరోన్ పేర్కొన్నాడు.

