V6 News

ఇస్మార్ట్ స్టేషన్!...మంచిర్యాల రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు

ఇస్మార్ట్  స్టేషన్!...మంచిర్యాల రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు
  • అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో మారనున్న రూపురేఖలు
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో రూ. 26.49 కోట్లు మంజూరు
  • లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎలివేషన్లు, పార్కుల ఏర్పాటుతో ఎయిర్​పోర్ట్​ తరహా రూపు

కోల్​బెల్ట్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్​గా గుర్తింపు కలిగిన మంచిర్యాల రైల్వే స్టేషన్​ కొత్తరూపు సంతరించుకుంటోంది. అమృత్​ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో ప్రయాణికులకు మెరుగైన సౌలతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో మంచిర్యాల రైల్వే స్టేషన్​ రూపురేఖలే మారిపోనున్నాయి. ఉత్తర, దక్షిణ రైల్వే మార్గంలో కీలకంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్​ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌలతులు అందుబాటులోకి రానున్నాయి. అమృత్​ భారత్​ స్కీమ్​లో స్టేషన్​ను భవిష్యత్​ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు.

అత్యాధునిక వసతులు..

అమృత్​భారత్​ స్కీమ్​లో భాగంగా దేశవ్యాప్తంగా 500కు పైగా రైల్వే స్టేషన్లను ఎంపికయ్యాయి. ఇందులో రాష్ట్రంలో 15 స్టేషన్లు ఉండగా, మంచిర్యాలలో రూ.26.49 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు.2024 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వర్చువల్​గా పనులను ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి స్టేషన్లలో చేపట్టిన పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో పనుల్లో జాప్యం జరగడంతో ఎంపీ ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. మంచిర్యాల రైల్వే స్టేషన్​ను పూర్తిగా అప్​గ్రేడ్​ చేస్తున్నారు.

ఒక ప్లాట్​ఫామ్​ నుంచి మరో దానికి వెళ్లేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంప్​లు నిర్మిస్తున్నారు. విశాలమైన వెయింటింగ్​ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, ఏసీ వెయింటింగ్​ హాల్స్, రిఫ్రెష్​మెంట్​ రూమ్, లైటింగ్, లాకర్​రూమ్​లు, డ్రింకింగ్​ వాటర్, ఏటీఎంలు, డిజిటల్​ డిస్​ప్లేలు, సీసీ కెమెరాలు, క్రమబద్ధమైన పార్కింగ్​ ప్రాంతాలు వంటి సౌలతులు ఏర్పాటు చేస్తున్నారు. టూ, త్రీ, ఫోర్​ వీల్స్​ వెహికల్స్​ కోసం ప్రత్యేకంగా పార్కింగ్​ షెడ్లు, స్టేషన్​ ముందు వైపు పచ్చదనంతో ఆహ్లాదకరమైన ప్రవేశ ద్వారాలు, వాటికి అనుసంధానంగా  పార్కింగ్​ ఏరియా నిర్మాణ పనులు చేపట్టారు. 

రెస్ట్​హాల్స్​​నిర్మాణాలు, ఎస్కలేటర్​కు సంబంధించిన పనులు పూర్తి కావచ్చాయి. కమర్షియల్​ షాపింగ్​ కాంప్లెక్స్​లు, టికెట్​ కేంద్రాలు, సర్క్యూలేటింగ్, పార్కింగ్, గార్డెన్​​ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మే30లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని రైల్వే శాఖ ఆఫీసర్లు నిర్ణయించారు. మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్​ రైల్వే డివిజన్  మేనేజర్  గోపాలకృష్ణ వేర్వేరుగా రైల్వే స్టేషన్​లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రాండ్​ లుక్..​ 

దక్షిణ, ఉత్తర భారతంతో కలిపే కీలక మార్గంలో ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్​ మీదుగా ప్రతి రోజు హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, చెన్నై, విజయవాడ వంటి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రయాణిస్తాయి. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, సింగరేణి, ఇతర కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇలా అన్నివర్గాల వారు పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతి రోజు ఈ స్టేషన్​లో 62 రైళ్లు నిలుస్తాయి.5 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే శాఖకు ప్రతి రోజు రూ.5.50 లక్షల ఆదాయం సమకూరుతోంది. 

ప్రస్తుతం నాలుగు ఫ్లాట్​ఫాంలు, మూడు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు, రెండు లిఫ్టులు, మూడు విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నాయి. అమృత్​భారత్​ స్కీమ్​ ద్వారా ప్రయాణికుల సౌకర్యార్థం చేపడుతున్న పనులు పూర్తయితే మంచిర్యాల రైల్వే స్టేషన్​ ఆకట్టుకునే ఎలివేషన్​తో ఎయిర్​పోర్ట్​ తరహా గ్రాండ్​ లుక్​ను సంతరించుకోనుంది.

పనులు స్పీడప్​ చేయాలి

పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని రైల్వే స్టేషన్లలో కొత్త రైళ్ల హాల్టింగ్​లు, స్టేషన్ల అభివృద్దిపై తరచూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కలిసి విన్నవిస్తున్నా. మంచిర్యాల, రామగుండం,పెద్దపల్లి రైల్వే స్టేషన్లు అమృత్​భారత్​ స్కీంలో చేర్చారు. మంచిర్యాల రైల్వే స్టేషన్​లో చేపట్టిన అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు దూరం చేసి సురక్షిత, ఆధునిక సౌలతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం. పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, పార్కింగ్​ తదితర అంశాలపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. మంచిర్యాలలో రెండు నెలల్లో అత్యాధునిక సౌలత్​లు అందుబాటులోకి తీసుకవస్తం.
-పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ