V6 News

శంషాబాద్ లో విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. బాంబు పెట్టాం, పేల్చివేస్తామని హెచ్చరికలు

శంషాబాద్ లో విమానాలకు వరుస బాంబు బెదిరింపులు..  బాంబు పెట్టాం, పేల్చివేస్తామని హెచ్చరికలు
  • మిలియన్ డాలర్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్
  • లేకపోతే ఎయిర్ పోర్టులో ఫైరింగ్​ చేస్తామని మెసేజ్​లు
  • ఐదు రోజుల వ్యవధిలో ఏడు బెదిరింపు మెయిల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: శంషాబాద్‌‌ ఇంటర్నేషనల్  ఎయిర్‌‌‌‌పోర్టును వరుస బాంబు బెదిరింపులు హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రయాణికులను మరోవైపు బాంబు బెదిరింపు కాల్స్‌‌  మరింత భయాందోళలనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం కూడా శంషాబాద్‌‌  ఎయిర్‌‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. editor@epochtimes.cpm ఐడీతో మెయిల్‌‌, +1-20161 43989 నంబరుతో బెదిరింపు కాల్  వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని.. ఆ విమానాలన్నీ  టేకాఫ్  అయిన పది నిమిషాల్లో పేలుస్తామంటూ దుండగులు మెయిల్  చేశారు. బాంబు పేలకూడదంటే  మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలని బ్లాక్‌‌మెయిల్‌‌ చేశాడు.  

గంటల వ్యవధిలోనే రెండు బెదిరింపులు

బాంబు బెదిరింపు మెయిల్‌‌  వచ్చిన వెంటనే ఎయిర్ పోర్ట్  అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్ట్​లో  అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సోదాలు చేస్తున్న సమయంలోనే  మరో బెదిరింపు కాల్‌‌ వచ్చింది. మిలియన్  డాలర్లు ఇవ్వకపోతే ఎయిర్‌‌పోర్టులోని జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని బెదిరించాడు. అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్  చేసి బెంగళూరులో కూల్చివేస్తామంటూ భయాందోళనకు గురిచేశారు. 

కొన్ని గంటల వ్యవధిలోనే  రెండు వార్నింగులతో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌  భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. న్యూయార్క్‌‌ నుంచి జాస్పర్ పకార్ట్  అనే వ్యక్తి బెదిరింపు మెయిల్ పంపినట్టు గుర్తించారు. ఇలా ఐదు రోజుల వ్యవధిలో ఏడు బెదిరింపు మెయిల్స్‌‌  రావడంతో ఎయిర్‌‌పోర్టు సిబ్బందితో కలిసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఐపీ అడ్రెస్‌‌లను గుర్తించి నిందితుల అరెస్టు

లండన్  నుంచి శనివారం శంషాబాద్  ఎయిర్ పోర్ట్​కు వచ్చిన బ్రిటిష్  ఎయిర్‌‌‌‌వేస్‌‌ (బీఏ- 277) కువైట్  నుంచి వచ్చిన (కేయూ-373) విమానాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్  వచ్చింది. ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌  కస్టమర్  సపోర్ట్‌‌  ఐడీకి ఆగంతకులు బెదిరింపు మెయిల్‌‌  పంపారు.

 దీంతో ఈ రెండు విమానాలు శంషాబాద్  ఎయిర్ పోర్ట్​లో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. శుక్రవారం కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఎయిరిండియా విమానం, సౌదీ అరేబియా నుంచి శంషాబాద్  ఎయిర్‌‌‌‌పోర్టుకు వస్తున్న ఎమిరేట్స్‌‌  విమానం, మదీనా నుంచి వస్తున్న ఇండిగో బోయింగ్  విమానానికి బాంబు బెది రింపు మెయిల్స్‌‌ వచ్చాయి. కాగా.. మెయిల్స్, ఫోన్  కాల్స్  అన్నీ ఉత్తుత్తివేనని, కొంతమంది ఆకతాయిలు అలా చేస్తున్నారని శంషాబాద్  డీసీపీ రాజేశ్  తెలిపారు. మెయిల్స్ పంపిన వారి ఐపీ అడ్రెస్‌‌లను ట్రేస్  చేసి నిందితులను అరెస్టు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.