కేంద్ర మంత్రి రాణెకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

కేంద్ర మంత్రి రాణెకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
  • అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే.. 
  • కేంద్ర మంత్రి రాణెకు ముంబై హైకోర్టు షాక్​
  • రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు
  • స్టే ఆర్డర్​ ఇచ్చేందుకూ నిరాకరణ

ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్​ రాణెకు ముంబై హైకోర్టు షాక్​ ఇచ్చింది. జుహు ఏరియాలో కట్టుకున్న బంగ్లాలోని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, రెండు వారాల్లో వాటిని కూల్చేయాలని బృహన్ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ (బీఎంసీ) అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా కూల్చిన వారంలోపు సబ్మిట్​ చేయాలని సూచించింది. అదేవిధంగా రూ.10లక్షల జరిమానాను మహారాష్ట్ర స్టేట్​ లీగల్​ సర్వీసెస్​ అథారిటీలో రెండు వారాల్లో జమ చేయాలని రాణె ఫ్యామిలీకి చెందిన కాల్కా రియల్​ ఎస్టేట్​ కంపెనీని ఆదేశించింది. ఫ్లోర్​ స్పేస్​ ఇండెక్స్​తో పాటు కోస్టల్​ రెగ్యులేషన్​ జోన్​ రూల్స్​ను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారని డివిజన్​ బెంచ్​ జడ్జిలు జస్టిస్​ ఆర్​డీ ధనుకా, జస్టిస్​ కమల్ ఖటా తెలిపారు.

బీఎంసీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం..

బీఎంసీ ఇచ్చిన పర్మిషన్​ కంటే మూడు రెట్లు ఎక్కువ నిర్మాణాలు చేపట్టినట్టు జడ్జిలు వివరించారు. వీటికి బీఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కూడా క్లియరెన్స్​ తీసుకోలేదన్నారు. నారాయణ్​ రాణె కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు అంగీకరిస్తే.. అక్రమ కట్టడాలను ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాణె ఇంటి కూల్చివేత విషయంలో బీఎంసీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మున్సిపల్​ అధికారులు తనిఖీ చేశాకే.. అక్రమ నిర్మాణాలని తేలాయన్న విషయాన్ని జడ్జిలు గుర్తు చేశారు. ముంబైలో ఇల్లీగల్​ కన్​స్ర్టక్షన్స్​ కూడా పెరిగిపోతున్నాయని అన్నారు. చట్టానికి భయపడకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఆరు వారాల పాటు స్టే ఆర్డర్​ ఇస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్తామని రాణె తరఫు అడ్వొకేట్​ శార్దుల్​ సింగ్​ ముంబై హైకోర్టును కోరగా.. అందుకు న్యాయస్థానం తిరస్కరించింది.