విజయ్ తో జాన్వీ కపూర్ సినిమా రూమర్ మాత్రమే

విజయ్ తో జాన్వీ కపూర్ సినిమా రూమర్ మాత్రమే

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై గత నాలుగేళ్లుగా రకరకాల పుకార్లు షికారు చేశాయి తప్ప ఏదీ నిజమవలేదు. ఇటీవల ఈ రూమర్స్ మరీ ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే స్వయంగా జాన్వీ తండ్రి బోనీకపూర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చుకునేంతగా. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. గతంలో ఓసారి విజయ్ తన ఫేవరేట్ హీరో అని చెప్పడం ఇందుకు బలాన్నిచ్చింది. క్రేజీ ప్రాజెక్టులన్నాక ఇలాంటి ప్రచారాలు కామన్. కానీ ఈ సినిమా కోసం జాన్వీని అడిగితే రిజెక్ట్ చేసింది, గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాల్లో చాన్సులు వచ్చినా కాదంది అంటూ నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. అంతేకాదు సౌత్  సినిమాలంటేనే జాన్వీకి చిన్నచూపు అనే తరహాలో గాసిప్స్ స్వైర విహారం చేశాయి. ఇవి కాస్తా బోనీకపూర్ చెవిన పడ్డాయి. దాంతో దీనిపై క్లారిటీ ఇస్తూ బోనీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మేము (కపూర్ ఫ్యామిలీ) దక్షిణాది చిత్రాలను చాలా ఇష్టపడతాం. శ్రీదేవికి  సౌత్ ఇండస్ట్రీతో గ్రేట్ రిలేషన్స్ ఉన్నాయి. కృష్ణ, చిరంజీవితో సహా చాలామంది అగ్రతారలతో ఆమె నటించింది. అలాగే మహేష్ బాబు, మేము సన్నిహితంగా ఉంటాం, గౌరవంగా మెలుగుతాం. జాన్వీకి కూడా సౌత్‌‌‌‌ మీద ఇష్టం ఉంది. ఎంట్రీ ఇవ్వడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోంది. మేమూ ప్రయత్నిస్తున్నాం. ఇంకా మెటీరియలైజ్ కాలేదు. టాప్ స్టార్స్ సరసన అవకాశం వస్తే జాన్వీ కాదందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అని ప్రకటించారు. మరి బోనీకపూర్ స్వయంగా చెప్పారు కనుక ఇకనైనా ఈ రూమర్స్‌‌‌‌కి ఫుల్‌‌‌‌స్టాప్ పడుతుందేమో చూడాలి!