- చిన్న వ్యాపారాలకు రూ.2.5 లక్షల కోట్ల స్కీమ్
- కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల నష్టపోతున్న వ్యాపారాలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను తీసుకురావాలని చూస్తోంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈల)కు రూ.2.5 లక్షల కోట్ల రుణాలను ఇవ్వనున్నాయి.
ఈ స్కీమ్ కింద రూ.100 కోట్ల వరకు ఇచ్చే రుణాలపై 90శాతం వరకు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. లోన్లు డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ గ్యారంటీని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) కి తీసుకెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటాయి. గ్యారంటీ కోసం ప్రభుత్వం రూ.17 వేల నుంచి రూ.18 వేల కోట్ల వరకు ఫండ్స్‌ను కేటాయించనుందని అంచనా.
కొవిడ్-19 సమయంలో అమలు చేసిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) మాదిరే ఈ స్కీమ్ కూడా పనిచేస్తుంది. ఈసీఎల్‌జీఎస్‌లో 100శాతం గ్యారంటీ ఇచ్చి, రుణాలపై వడ్డీ రేట్లు పరిమితం చేసి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా రుణాలు ఇచ్చారు. ఈ స్కీమ్ 2023 మార్చి వరకు కొనసాగింది.
