డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి: కేంద్రం

డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి: కేంద్రం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ముప్పు పొంచి ఉండటాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. డ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలంటూ CRPF బలగాలకు కేంద్రం ‘షూట్‌ ఎట్ సైట్’ ఆదేశాలు జారీ చేసింది. నెలరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్టర్ జిల్లా కిష్టారామ్, పల్లోడి ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్ శిబిరాలపై డ్రోన్ తరహా వస్తువులు ఎగురుతూ కనిపించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

CRPF శిబిరాలపై గత నెలలో కనీసం నాలుగుసార్లు ఎరుపు, తెలుపు లైట్ల కాంతితో డ్రోన్లు సంచరించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. భద్రతా దళాలు అప్రమత్తమై కూల్చివేతకు పొజిషన్ తీసుకోవడంతో పాటు, ఇది నక్సల్స్ పని కావచ్చనే సమాచారం పంపుతూ సమీపంలోని CRPF క్యాంపులను అలర్ట్ చేశాయి. డ్రోన్ల కూల్చివేతకు బలగాలు పొజిషన్ తీసుకునే సమయానికి డ్రోన్లు మాయమయ్యాయి. రోడ్ల అనుసంధానం లేని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రెండు సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఉన్నాయి. భద్రతా బలగాల కదలికలను పసిగట్టేందుకు మావోయిస్టులు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.