హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో స్థానికతకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన కొత్త జోనల్ సిస్టంతో 2012 బ్యాచ్ ఎస్సైల ప్రమోషన్లలో కొత్త కిరికిరి మొదలైంది. జోనల్వ్యవస్థ మార్పుల వల్ల పాత హైదరాబాద్ జోన్‌పరిధిలో రిక్రూట్మెంట్ అయిన పలువురు 317 జీవోతో ప్రస్తుత మల్టీ జోన్1 పరిధిలోకి వచ్చారు. దీంతో పాత వరంగల్ జోన్లో రిక్రూట్మెంట్అయిన ఎస్సైలకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అంతేగాకుండా ఒకే బ్యాచ్‌కు చెందిన కొందరికి పాత జోన్ల ప్రకారం, మరికొందరికి కొత్త జోన్ల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ముందుగా ప్రమోషన్లు రావాల్సిన వారు వెనుకబడుతున్నారు. నాలుగైదు ఏండ్ల సర్వీస్‌నూ నష్టపోవాల్సి వస్తోంది. అందరికీ సమ న్యాయం జరగాలంటే పాత జోన్ల ప్రకారం రిక్రూట్మెంట్ అయిన వారికి పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు
అసలేం జరిగిందంటే..
2012లో పాత వరంగల్, హైదరాబాద్ జోన్ల వారీగా ఎస్సైల రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటినుంచి వారికి ఆయా జోన్ల పరిధిలోనే ప్రమోషన్లు ఇస్తున్నారు. కొత్త జోనల్ సిస్టంలో భాగంగా ప్రభుత్వం రాష్ర్టాన్ని ఏడు జోన్లుగా విభజించడంతో పాటు రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేసింది. పాత హైదరాబాద్ జోన్ పరిధిలోని మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ప్రస్తుత మల్టీ జోన్ 1 పరిధిలోకి వచ్చాయి. ఈ నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 60 మంది ఎస్సైలు ప్రమోషన్లలో ముందు వరుసలోకి వచ్చారు. పాత వరంగల్ జోన్ పరిధిలో తక్కువ మంది రిక్రూట్మెంట్ కావడం, కొత్త జిల్లాలు, కమిషనరేట్లు ఏర్పాటు కావడం వల్ల ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. త్వరగా ప్రమోషన్లు కొట్టేసేందుకు చాలామంది ఎస్సైలు పాత హైదరాబాద్ జోన్ నుంచి మల్టీ జోన్ 1 పరిధిలో చేరారు. దీంతో పాత వరంగల్ జోన్ పరిధిలో 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఎస్సైల ప్రమోషన్లను కొత్తగా వచ్చినవారు తన్నుకుపోతున్నారు. వాస్తవానికి ఆరు ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎస్సైలకు సీఐలుగా ప్రమోషన్లు రావాల్సి ఉండగా, ఇప్పుడు మరో నాలుగైదు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పాత జోన్ల ప్రకారమే ఇవ్వాలి..
ఇప్పటికే తీవ్ర జాప్యమైనందున మల్టీ జోన్ల ప్రకారం ప్రమోషన్లు చేపడితే మరింత నష్టపోతామని బాధిత ఎస్సైలు వాపోతున్నారు. తమకు పాత జోన్ల ప్రకారమే ప్రమోషన్లు కల్పించాలని కోరుతున్నారు. 2018లో ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు వెలువడ్డాయి తప్ప సర్వీస్ సీనియారిటీ, ప్రమోషన్ల విషయాన్ని అందులో ప్రస్తావించలేదని గుర్తుచేస్తున్నారు. కొత్త జోనల్ సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 2021, 2022 సంవత్సరాల్లో 2009, 2012 బ్యాచ్‌లకు చెందిన 42 మంది ఎస్సైలకు పాత జోన్ల ప్రకారమే సీఐలుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఇకముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలంటున్నారు. మల్టీ జోన్1 ప్రకారం ప్రమోషన్లు కల్పించినట్లయితే మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 60 మంది ముందు వరుసలోకి రావడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు.
రిక్రూట్మెంట్లలోనూ అన్యాయం..
పాత వరంగల్ జోన్ అభ్యర్థులకు ప్రమోషన్లలోనే కాకుండా అప్పటి రిక్రూట్మెంట్లలోనూ అన్యాయం జరిగింది. 2009, 2012 బ్యాచ్‌లలో మెజారిటీ పోస్టులను హైదరాబాద్ జోన్ అభ్యర్థులే దక్కించుకున్నారు. 2009 బ్యాచ్‌లో హైదరాబాద్ జోన్ నుంచి 420 మందిని తీసుకుంటే వరంగల్ జోన్ నుంచి కేవలం 150 మందిని ఎంపిక చేశారు. అదేవిధంగా 2012 బ్యాచ్‌లోనూ హైదరాబాద్ జోన్ నుంచి 428 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే వరంగల్ జోన్ నుంచి 149 మందినే తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో మూడింట ఒక వంతు మాత్రమే వరంగల్ జోన్ అభ్యర్థులకు దక్కాయి. ఇటు రిక్రూట్మెంట్లో, అటు ప్రమోషన్లలో నష్టపోతున్న వరంగల్ జోన్ అభ్యర్థులు ఈ సమస్యను పలుమార్లు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ప్రతీ సంవత్సరం డీపీసీని ఏర్పాటుచేసి ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, రెండేండ్లుగా దాని ఊసే లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు నష్టం జరగకుండా చూడాలని బాధిత ఎస్సైలు విజ్ఞప్తి చేస్తున్నారు.
