ఏసీబీ పట్టుకుంటున్నా.. లంచాలు ఆగలె

ఏసీబీ పట్టుకుంటున్నా.. లంచాలు ఆగలె

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవినీతి బాగోతం

సీఎం ఇలాకాలోనూ కనిపించని భయం

ఏడాదిలో 20 మంది పట్టివేత.. అయినా తగ్గని కరప్షన్..!

మెదక్ అడిషనల్‌ కలెక్టర్ అరెస్టుతో రెవెన్యూ శాఖలో కలకలం

సంగారెడ్డి/ మెదక్/ సిద్దిపేట, వెలుగుముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారుల ఆగడాలు ఎక్కువయ్యాయి. గడిచిన ఏడాది కాలంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అవినీతి తిమింగలాల నుంచి చిన్నచిన్న చేపల వరకు ఏసీబీ వలలో చిక్కాయి. భూ కుంభకోణాలు, పోలీసు శాఖలో అవినీతి, సర్కారు దవాఖానాల్లో కొనుగోళ్ల అక్రమాలు, మున్సిపాలిటీల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాల అనుమతులు ఇలా ఒక్కటేమిటి అనేక చోట్ల అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. ఎంతో మంది ఉద్యోగులు జైలు పాలయ్యారు. అయినా కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. తాజాగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ ఏసీబీకి చిక్కిడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఘటనతో జిల్లాలో కరప్షన్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది.

ఆరు దాడులు.. 13 మంది అరెస్టు

ఉమ్మడి జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ఆరు ఏసీబీ దాడులు జరుగగా 13 మంది అరెస్టయ్యారు. అలాగే వివిధ శాఖల్లో అక్రమాలకు పాల్పడిన మరో ఏడుగురు కలెక్టర్ల చేతిలో సస్పెన్షన్ కు గురయ్యారు.

మెదక్ హాట్ టాపిక్..

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌అవినీతి బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ‘ఇంతకు ముందు చాలా సార్లు వీఆర్వోలు, ఆర్ఐలు, తహసీల్దార్లు ఇతర ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం చూశాం.. కానీ జిల్లా స్థాయి ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం..’ అంటూ చర్చించుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో  ఏడాదిన్నర కాలంలో నాలుగు ఏసీబీ దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2018 లో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సీనియర్ అసిస్టెంట్ నరేందర్ గౌడ్ లో ట్రాన్స్ఫర్ విషయంపై ఓ డాక్టర్ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. సదాశివపేట టౌన్ ప్లానింగ్ అధికారులు ఎం.దినేశ్‌‌, చంద్రశేఖర్ రూ.70 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అలాగే గుమ్మడిదల ఇరిగేషన్ శాఖ ఏఈఈ ఉపేందర్ రెడ్డి, ఝరాసంగం మండలం అవుదాత్ పూర్ పంచాయతీ కార్యదర్శి రావుఫ్ షరీఫ్ ఏసీబీకి పట్టుబడ్డారు.

మెదక్ జిల్లాలో…

112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు భారీగా డిమాండ్ చేసిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణరెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ మరో ఇద్దరు రెండు రోజుల క్రితం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ దాడి ఘటన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులపై  ప్రభావితం చేస్తోంది. అంతకుముందు హెడ్ నర్స్ గా పనిచేస్తూ చనిపోయిన మహిళా ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ శాంక్షన్ చేసేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ మెదక్ డీఎంహెచ్‌‌వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్   షౌకత్ అలీ గతేడాది జూలై 23న ఏసీబీకి దొరికాడు. ఈ కేసులో షౌకత్ అలీతో పాటు లంచం డిమాండ్ చేసిన శివ్వంపేట పీహెచ్ సీ ఎంప్లాయ్‌‌ నర్సింహులుపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

సిద్దిపేట జిల్లాలో…

ఆరు నెలల క్రితం అడిషనల్‌‌‌‌ డీసీపీ నరసింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుపై సిద్దిపేట కార్యాలయంతో పాటు అతడి బంధు, మిత్రుల ఇండ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి అక్రమ ఆస్తుల చిట్టాను బయటకు తీశారు. పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే ఏసీబీ దాడులతో సంబంధం లేకపోయినప్పటికీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కన్నపేట, బెజ్జంకి తహసీల్దార్లు, చేర్యాల సబ్ రిజిస్టర్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే పోలీసు శాఖలో ఇద్దరు ఎస్సైలు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

ల్యాండ్ సర్వే ఆఫీస్‌‌లో అతడిదే రాజ్యం

మెదక్, వెలుగు: జనరల్​గా ఏ గవర్నమెంట్​ ఆఫీస్​లో రికార్డుల్లో మార్పులు, చేర్పులు, మరేమైనా శాఖ పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ హయ్యర్​ ఆఫీసర్ కీలకంగా వ్యవహరిస్తారు. కానీ మెదక్ జిల్లా ల్యాండ్ సర్వే ఆఫీస్‌‌లో మాత్రం ఓ చిరుద్యోగిదే రాజ్యం. ఈ ఆఫీస్​కు చీఫ్ అసిస్టెంట్​ డైరెక్టర్​ గంగయ్య. కానీ జూనియర్​ అసిస్టెంట్​ మహ్మద్​ వసీం భూముల సర్వే, రికార్డుల్లో మార్పులు, చేర్పుల విషయంలో అంతా తానే అన్నట్టు వ్యవహరించే వారట. నిబంధనలకు విరుద్ధంగా జరిగే ల్యాండ్ సెటిల్​మెంట్లలో లంచాలు తీసుకుని అక్రమార్కులకు ఫేవర్​ చేసే వాడట. లంచం ఇస్తే ఆఫీస్​ టైమింగ్స్ తో పనిలేకుండా, సెలవు రోజుల్లోనూ డ్యూటీ చేసే డని చెప్తున్నారు. నర్సాపూర్​ మండలం చిప్పల్​తుర్తిలోని 112 ఎకరాలకు ఎన్వోసీ జారీ కోసం అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌రూ.1.12 కోట్లు లంచం డిమాండ్​ చేసి ఏసీబీకి పట్టుబడిన వ్యవహారంలో ఆయనతో పాటు వసీం కూడా అరెస్ట్​ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అతడు రూ.3 లక్షలు లంచం తీసుకోవడం గమనార్హం. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ సెటిల్ మెంట్ చేసిన ఇతర అనేక అక్రమ భూవ్యవహారాల్లో సైతం వసీం పాత్ర  ఉన్నట్టు తెలిసింది. సాక్షాత్తు అడిషనల్​ కలెక్టర్‌‌ అండ ఉండడంతో అతడి అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని పలువురు పేర్కొన్నారు.