పోలీస్ అన్నాచెల్లెళ్లు

పోలీస్ అన్నాచెల్లెళ్లు

కష్టానికి ఒక వైపు..  ఇంటర్‌‌లో ఉండగా నాన్న చనిపోయారు.. డిగ్రీ అయిపోయాక అమ్మ చనిపోయారు. తల్లి చనిపోయిన నెలరోజులకే ఇష్టమైన పోలీస్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చింది. కళ్ల ముందు కలల ఉద్యోగం ఓ వైపు.. కన్నతల్లి లేదన్న కన్నీళ్లు మరోవైపు. అయినా అమ్మ కోరుకున్నది నాన్న చూడాలనుకున్నది నన్ను పోలీస్‌గానే కదా అనుకుంటూ చదవడం మొదలుపెట్టాడు నల్గొండ జిల్లా మునగాలకు చెందిన తంగెళ్ల సాయి దీపక్.  ఆ కష్టానికి కానిస్టేబుల్ ఉద్యోగం దక్కింది. అందులో జాయిన్ అయ్యాక రిలాక్స్ అవ్వలేదు. మళ్లీ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఎస్‌ఐకి గురిపెట్టాడు. రెండోసారి కూడా తన టార్గెట్ మిస్సవ్వలేదు. ఇటీవల ప్రకటించిన దీపక్ ఎస్‌ఐగా సెలెక్టయ్యాడు.

2014లో డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ వచ్చేశా. అప్పుడే పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అప్పటికి మా అమ్మ చనిపోయి నెలరోజులే అవుతోంది. మేమున్న పేదరికం నుంచి బయటపడాలన్నా, సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు కావాలన్నా జాబ్ కొట్టడం తప్పనిసరి అన్పించింది. అదే మైండ్‌లో పెట్టుకుని చదివా. ప్రస్తుతం భువనగిరిలో ఏఆర్‌‌ కానిస్టేబుల్‌గా చేస్తున్నా. పోస్టింగ్ రాగానే ఎస్‌ఐ జాబ్‌లో జాయిన్ అయిపోతా..

కష్టానికి రెండో వైపు..  అమ్మానాన్న చనిపోయినా అన్నయ్య పట్టువదలకుండా చదవడం చూసిన చెల్లెలు తంగెళ్ల శ్వేత తానెందుకు అన్నలా అవ్వకూడదు అనుకుంది. అన్నతోపాటే ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌కు వెళ్లి రన్నింగ్, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసింది. ఈవెంట్స్‌ల్లోనూ సత్తా చాటింది. ఫలితం అన్నతో పాటే ఏఆర్ కానిస్టేబుల్ దక్కింది. ప్రస్తుతం అంబర్‌‌పేటలో ఉద్యోగం చేస్తోంది.

మాకు డబ్బుల్లేవు, సపోర్ట్ చేసేవాళ్లు అని కారణాలు వెతుక్కోకుండా ఇష్టపడి చదివితే కొలువు వస్తుందనడానికి నేను, మా అన్నయ్యే నిదర్శనం. అమ్మాయిని అయినా సరే ఈవెంట్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. అన్నయ్యతోపాటే సమానంగా ప్రాక్టీస్ చేశా. మా అక్క శ్రావ్య, బావ శ్రీరాం, బాబాయి సైదులు, పిన్ని పద్మావతి ఆర్థికంగా, మానసికంగా మాకు చాలా సపోర్ట్ చేశారు. వారి వల్లే ఈరోజు అన్నయ్య, నేను జాబులు కొట్టగలిగామని బలంగా నమ్ముతున్నా. అమ్మానాన్న లేకపోయినా సాధించాలనే బలమైన కోరిక ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అనిపించింది.

– మునగాల, వెలుగు