
కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. కొన్ని రోజులుగా పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్షంగా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీని కవిత ఇరకాటంలోకి నెట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే కవిత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ లపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి కారణం హరీష్, సంతోష్ అని తీవ్ర ఆరోపణలు చేసి బీఆర్ఎస్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ లను కవిత నేరుగా టార్గెట్ చేయడంపై బీఆర్ఎస్ అధిష్టానం కవితపై ఆగ్రహించింది. హరీశ్ రావు వల్లే కాళేశ్వరం ఇంత వరకు వచ్చిందని.. అందుకే ఆయనను రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా కొనసాగించలేదంటూ కవిత తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలని.. ఈ ఇద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను దుమారం రేపాయి. కవిత వ్యాఖ్యలు చేసిన కొంతసేపటికే కేటీఆర్ తో పాటు, పలువురు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ హుటాహుటిన మంతనాలు జరిపారు. కవిత విషయంలో ఫైనల్ గా ఏం చేద్దామని అధిష్టానం కీలక నేతల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించి తాజాగా ప్రకటన విడుదల చేసింది.
మొన్నటి వరకు కవిత విమర్శలను కుటుంబ వ్యవహారంగా భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. హరీష్, సంతోష్ పై చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయింది. కవిత వ్యాఖ్యల తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే ఉన్న కేటీఆర్, ఇతర సీనియర్లు కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టం అని.. నేతలు, కార్యకర్తలు మరింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్, కేటీఆర్ లు.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్నే మంగళవారం మధ్యాహ్నం నోట్ రూపంలో అధికారికంగా బీఆర్ఎస్ విడుదల చేసింది.