కౌశిక్ రెడ్డిని చంపాలని చూశారు..డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కౌశిక్ రెడ్డిని చంపాలని చూశారు..డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్​ మనుషులు చంపాలని చూశారని, ఆయన​ ప్రోద్బలంతోనే కరీంనగర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని బీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. పోలీసులు కూడా ఆలస్యంగా స్పందించి కేసు పెట్టారని, ఎఫ్​ఐఆర్​లో సంజయ్​ పేరు చేర్చలేదన్నారు. ఈ కేసులో సంజయ్​ను నిందితుడిగా ఎఫ్​ఐఆర్​లో చేర్చాలని డిమాండ్ ​చేశారు. శుక్రవారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీజీపీ సీవీ ఆనందన్​ను కలిసి ఫిర్యాదు చేశారు.

కౌశిక్​రెడ్డిపై దాడి కేసుతోపాటు కేటీఆర్​ను అసభ్యకరంగా తిట్టినందుకు ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్​ నమోదు చేయాలని కోరారు. బీజేపీ నేతలు అటాక్​ చేస్తున్న సమయంలో చేష్టలుడిగి చూసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కౌశిక్​ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు భద్రతను పెంచాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి సంజయ్​ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసని బీఆర్​ఎస్​ ఎల్పీ విప్​ కేపీ వివేకానంద్​ అన్నారు. సీఎంకు ఎప్పుడు ఆపద వచ్చినా.. సంజయ్​ సహాయ మంత్రిగా ఉంటున్నారన్నారు.  కేటీఆర్​పై సంజయ్ వాడిన భాష.. బీజేపీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా ఉందా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​  ప్రశ్నించారు.