బంగాళాఖాతంలో అలజడి మొదలైందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే రెండో వారంలో సముద్రం తన ప్రతాపాన్ని చూపే అవకాశం ఉందని, ఒక అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోందని ఐఎండీ మే 7న జారీ చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మే 8 నుంచి మే 14 మధ్య నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ వాతావరణ మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
అయితే ఈ పరిస్థితులు తుపానుగా మారతాయా అంటే.. దానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఎండీ భాషలో చెప్పాలంటే ఇది కేవలం 'లో ప్రొబబిలిటీ' మాత్రమే. అంటే వాతావరణ పరిస్థితులు సహకరిస్తే తప్ప ఇది పెను తుపానుగా మారడం కష్టం. ఒకవేళ కాలం కలిసి వచ్చి, సముద్రపు గాలులు గంటకు 62 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే అప్పుడు దీనికి ‘ సైక్లోన్ అర్ణబ్’ అనే పేరు పెట్టాలని అధికారులు నిర్ణయించారు.
మే 13 నుండి 16 మధ్య ‘సైక్లోజెనెసిస్’ అంటే అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రక్రియ జరిగే అవకాశం ఉందని వెల్లడైంది. ప్రస్తుతం ఐఎండీ దీనిని ఒక సాధారణ వాతావరణ మార్పుగా మాత్రమే చూస్తున్నప్పటికీ.. వేసవి కాలంలో బంగాళాఖాతం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఊహించడం కష్టం కాబట్టి అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. మొదటి వారం మే 8-14, రెండో వారం మే 15-21 ఇలా రెండు దశల్లో ఈ పరిస్థితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు.
ప్రీ-మాన్సూన్ సీజన్‌లో ఇలాంటి వాతావరణ మార్పులు సహజమే అయినా.. ‘అర్ణబ్’ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ సముద్రపు అర్ణబ్ శాంతంగా విరమిస్తుందా? లేక వేగం పుంజుకుని తుపానులా గర్జిస్తుందా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే.. ఇది కేవలం చల్లని జల్లులు ఇచ్చి వెళ్లిపోయే అతిథిలాగే కనిపిస్తోంది. తుపాను గండం తప్పినట్లే అనిపిస్తున్నా.. సముద్రపు ఒడిలో దాగి ఉన్న ఈ మిస్టరీని వాతావరణ శాఖ నిరంతరం పరిశీలిస్తూనే ఉంది. కాబట్టి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
