తెలంగాణకు ‘అభివృద్ధి బాటలు’ వేసిన బీజేపీ

తెలంగాణకు ‘అభివృద్ధి బాటలు’ వేసిన బీజేపీ

రాజ్యాన్నేలే రాజు సమర్థుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. నాయకుడు  పరిపాలనా దక్షుడైతే  ప్రజలు సంతోషంగా ఉంటారు. గ్రామం నుంచి  దేశం దాకా పరిధి చిన్నదయినా, పెద్దదయినా పాలించేవారిపైనే  ప్రజాజీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే, అపారమైన దేశభక్తి,  అచంచలమైన శక్తి,  పాలనా సామర్థ్యం, అపరిమితమైన  మానవతా దృక్పథం  కలగలిసిన నాయకుడు నరేంద్ర దామోదర్​ మోదీ భారత  ప్రధాని అయ్యాక ఈ పన్నెండేండ్లలో  దేశం ఒక్కో చిక్కుముడిని  విప్పుకుంటూ వేగంగా ముందడుగు వేస్తోంది.

బాహుబలి సినిమాలో ‘మాహిష్మతి  నీ కొడుకొచ్చాడు, ఊపిరి పీల్చుకో’  అన్నట్లు,  పాకిస్తాన్​ పాలిపగ,  బంగ్లాదేశ్​ చొరబాట్లు,  అగ్రరాజ్యాల పెత్తనాలు,  సరిహద్దు దేశాల దొంగాటలు,  అంతర్గత  కుటుంబ పార్టీల స్వార్థ పరిపాలన,  అవినీతి,  అరాచకాలు, ఉగ్రవాదం,  నక్సలిజంతో  కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 2014లో  భారత  ప్రధానిగా  ప్రమాణ స్వీకారం  చేసినప్పటి నుంచి మోదీ గాడిలో పెట్టారు.  అప్పుడే  ఏర్పడిన  తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్నలాగ అండగా నిలిచారు. ఈ నెల 10న (ఆదివారం నాడు)  రాబోతున్న ప్రధాని మోదీ తెలంగాణకు మరిన్ని అభివృద్ధి బాటలు వేయబోతున్నారు.

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు
1997లో  కాకినాడలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ భారతీయ జనతాపార్టీ సమావేశంలో  ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానంతో మొదలై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతిచ్చిన తీరు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువరు. బీజేపీకి తెలంగాణపై ఉన్న వాత్సల్యాన్ని, బాధ్యతను  భారత  ప్రధానిగా  మోదీ  కొనసాగించారు. పన్నెండేండ్లలో 12 లక్షల కోట్ల  కేంద్ర  నిధులతో తెలంగాణ అభివృద్ధికి  బంగారు బాటలు వేశారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరం 63 ఏండ్లపాటు  ఉమ్మడి రాష్ట్రంలో  వలస పాలనలో అభివృద్ధికి దూరమైన రాష్ట్రానికి అండగా నిలిచి రాష్ట్రానికి నిధుల వరద పారిస్తున్నారు.

దేశంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న 60 ఏండ్లు  తెలంగాణ ప్రాంతంపై  సవతి ప్రేమ చూపించింది.  కానీ,  మోదీ  పరిపాలనలో  తెలంగాణలో  మౌలిక వసతుల కల్పన ‘నభూతో నభవిష్యత్’.  భాగ్యనగరంలో  బయలుదేరితే  నలుదిక్కులా  తెలంగాణ  సరిహద్దు జిల్లాల దాకా ఎక్కడికైనా కేవలం 2–3  గంటల్లో గమ్యానికి  చేరుకోగలిగే  జాతీయ రహదారులు,  తెలంగాణ   అభివృద్ధికి దాదాపు రూ.1,40, 000 కోట్లు ఖర్చుపెట్టి మోదీ  ప్రభుత్వం  బంగారు బాటలు వేసింది.  

రోడ్డు, రైలు, ఎయిర్​పోర్టు కనెక్టివిటీ
దేశ స్వాతంత్ర్యానంతరం తెలంగాణలో మొట్టమొదటి  రైల్వే టెర్మినల్​రూ.450 కోట్లతో చర్లపల్లిలో నిర్మించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే.  సామాన్య ప్రయాణికులకు సైతం అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనే  సదుద్దేశంతో  రూ.719 కోట్లతో  విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ను  ఆధునికీకరించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను రూ.40వేల కోట్ల నిధులతో మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.  జిల్లా కేంద్రాలను విమానయాన ప్రయాణానికి అనుసంధానం చేస్తూ 5 కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వడంతోపాటు  వరంగల్​లో  కాంగ్రెస్​ పాలనలో దశాబ్దాలుగా కలగానే  మిగిలిపోయిన ‘మామునూర్​ ఎయిర్​పోర్ట్’కు   రూ.500 కోట్లు కేటాయించి  పనులు  ప్రారంభింపజేసింది.

ఆనాడు  కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన విభజన చట్టంలోని  ‘కాజీపేట  కోచ్​ ఫ్యాక్టరీ’ తమ భుజస్కంధాలపై వేసుకుని స్వయంగా నరేంద్ర మోదీ రూ.522 కోట్లు కేటాయించి  శంకుస్థాపన చేశారు.  దేశంలో  7 టెక్స్​టైల్​ పార్కులు ప్రారంభిస్తే అందులో తెలంగాణకు  ఒకటి  కేటాయించి రేపు 10వ తేదీన వరంగల్​లో  రూపుదిద్దుకున్న కాకతీయ  టెక్స్​టైల్​ పార్కును వర్చువల్​గా  ప్రారంభించనున్నారు.  ఎన్నడో  కాంగ్రెస్​  అధికారంలో ఉండగా మూతపడిన  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6,338 కోట్ల  కేంద్ర నిధులతో ఖర్చుపెట్టి  పున:ప్రారంభించారు. 

కిసాన్​ సమ్మాన్ ​నిధి
పామాయిల్​ పంట తెలంగాణ  ఒక వ్యవసాయ విప్లవం. రైతులకు నికర ఆదాయాన్నిచ్చే వాణిజ్య పంట.  మొక్కలు,  ఎరువులు, పెట్టుబడి సాయాన్ని, మార్కెటింగ్​ సౌకర్యాన్ని కల్పించి, తెలంగాణలోనే ఆయిల్​ ప్రాసెసింగ్​ ఫ్యాక్టరీలను  నెలకొల్పే  బృహత్తర ప్రణాళికను చేసింది  కేంద్ర ప్రభుత్వమే. 

7 కొత్త నవోదయ స్కూల్స్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ, 25 ఏకలవ్య పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకంతోపాటు సర్వశిక్ష అభియాన్​ నిధులు, కస్తూర్బా పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీల్లో మౌలిక  వసతుల కల్పన, ఆయుష్మాన్​ భారత్​ ద్వారా రూ.5లక్షల దాకా ఉచిత ఆరోగ్య సేవలు, తెలంగాణ  రైతులకు కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా ఇప్పటివరకు రూ.15 వేల కోట్ల పెట్టుబడి సాయం, ఎకరాకు ఒక పంటకు రూ.18వేలు ఎరువుల సబ్సిడీ కలిపిస్తున్నదీ మోదీ ప్రభుత్వమే.   అన్నీ ఒకెత్తు,  మహిళాభ్యుదయం మరో ఎత్తు. 

తెలంగాణ మహిళలను కట్టెల పొయ్యి నుంచి విముక్తులను చేయడం కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా  కోటి 80 లక్షల ఉచిత గ్యాస్​ కనెక్షన్లను అందించింది. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం  32 లక్షల టాయిలెట్లను స్వచ్ఛ భారత్​ పథకం కింద నిర్మింపజేసింది. 

ప్రధాని మోదీపై విశ్వాసం
ఇందిరమ్మ  ఇళ్ల  పేరుతో  రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న  పేదలకు  ఇండ్ల  పంపిణీ పథకంలో  60శాతం  మహిళల పేరుపై ఉండేటట్టు పథకాన్ని రూపొందించి  పట్టణ  గృహాలకు రూ.1,50,000,  గ్రామీణ ప్రాంతంలో  రూ.75వేల  ఆర్థికసాయం  కేంద్రమే ఇస్తుంది.  ఇప్పటిదాకా  దాదాపు  రూ.6వేల కోట్లు కేంద్రం నుంచి  నిధులు  రాష్ట్రానికి  సమకూరాయి.  ఇలా  చెప్పుకుంటూపోతే ‘ఇందు గలడందులేదు.. ఎందందు వెతికినా నందందు కలదు’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం సహకారం  లేకుండా  తెలంగాణ రాష్ర్టంలో అభివృద్ధి జరగలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక  తెలంగాణ గ్రామాలయితే చెప్పనక్కరలేదు.

రోడ్లు, నీటి సౌకర్యాలు, లైట్లు, రైతు వేదికలు, ఉపాధి హామీ పథకం, రేషన్​ బియ్యం, గ్రామ సచివాలయాల నిర్వహణ...అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూరినవే.  అందుకే  తెలంగాణ  ప్రజలు బీజేపీకి,  ప్రధాని మోదీకి  బ్రహ్మరథం పడుతున్నారు. గత పన్నెండేండ్లలో రాష్ట్రంలో పెరుగుతున్న  ఓటు బ్యాంకే దానికి  నిదర్శనం. రాబోయే ఎన్నికల్లో  బీజేపీని ఆదరించి రాష్ట్రంలో డబుల్​  ఇంజిన్​  సర్కారుకు  అవకాశమిస్తే  తెలంగాణ  అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రజలు భావిస్తున్నారు. అప్పట్లో వాజ్​పేయి అన్నట్లుగానే ‘అంధేరా ఛటేగా,  కమల్​ ఖిలేగా’ చీకటి తొలగిపోతుంది, తెలంగాణలో  కమలం వికసిస్తోంది.   

రాణీ రుద్రమా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.