ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నడు.. విజయ్పై టీటీవీ దినకరన్ విమర్శ

ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నడు.. విజయ్పై టీటీవీ దినకరన్ విమర్శ

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే అధినేత విజయ్‌‌పై ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు విజయ్‌‌కు ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది స్పష్టంగా ‘హార్స్ ట్రేడింగ్’  లేదా ‘ఫోర్జరీ’ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు పూర్తి సంఖ్యా బలం ఉందంటూ టీవీకే చీఫ్​ విజయ్ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించిన జాబితాలో తన పార్టీ ఎమ్మెల్యే పేరు ఉండడంపై దినకరన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 విజయ్ సమర్పించిన జాబితాలో 116 మంది మాత్రమే ఉన్నారని, అందులో తమ ఎమ్మెల్యే పేరును అక్రమంగా చేర్చారని దినకరన్ ఆరోపించారు. తమిళనాడులో ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి ‘పోచింగ్’కు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దీనిపై గవర్నర్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దినకరన్ డిమాండ్ చేశారు. 

కాగా, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ విజయ్ రెండుసార్లు కలిసినా గవర్నర్ అర్లేకర్ నిరాకరించారు. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని టీవీకే సభ్యుడు ఒకరు సుప్రీంను ఆశ్రయించారు.