షాద్ నగర్ లో దొంగ ఓనర్లు.. దోచుకున్నరు...నిర్మాణంలో ఉన్న బిల్డింగులకు యజమానులంటూ టోకరా

షాద్ నగర్ లో దొంగ ఓనర్లు.. దోచుకున్నరు...నిర్మాణంలో ఉన్న బిల్డింగులకు  యజమానులంటూ టోకరా
  •     రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారుల  దగ్గర రూ.16 లక్షలు మాయం 
  •     ఇద్దరు నిందితుల అరెస్ట్

షాద్ నగర్, వెలుగు:  నిర్మాణంలో ఉన్న బిల్డింగులకు తామే ఓనర్లమని నమ్మించి రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు నిందితులను రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతో పాటు కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ డీసీపీ శిరీష కథనం ప్రకారం.. షాద్​నగర్​కు చెందిన చిల్లా సూర్య ప్రతాప్ రెడ్డి రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారి. మే 2న కమ్మరి రమేష్ అలియాస్ విశాల్.. సూర్య ప్రతాప్ రెడ్డిని సంప్రదించాడు. కొత్తూరులో తను ఓ బిల్డింగ్​కడుతున్నానని, దానికి కాంక్రీట్ కావాలని కోరాడు. రూ. 50 వేలు అడ్వాన్స్ చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. మిగిలిన రూ. 4,23,500 పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. పని పూర్తయ్యాక, డబ్బులడగ్గా అకౌంట్​ట్రాన్స్​ఫర్​చేస్తానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బాధితుడు బిల్డింగ్​వద్దకు వెళ్లగా విశాల్ ఓనర్​కాదని తేలింది. 

అయితే, అసలు యజమాని నుంచి పని తీసుకున్న విశాల్ కాంక్రీట్ సరఫరా చేసి పూర్తి డబ్బును వసూలు చేసుకున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఇదే తరహాలో చేవెళ్ల, గజ్వేల్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు రూ.16.50 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్టు తెలుసుకున్నాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఇన్ముల్ నర్వలో మరో మోసానికి రెడీ అవుతుండగా కొత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రూ.2.39 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కమ్మరి రమేశ్​తో పాటు మరో నిందితుడు వేముల ప్రేమ్ కుమార్ పక్కా ప్లాన్​ప్రకారం ఇలాంటి మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు.