నీళ్లపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైటింగ్..పెండ్లిలో మాటా మాట పెరిగి కర్రలతో కొట్టుకున్నరు

నీళ్లపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైటింగ్..పెండ్లిలో మాటా మాట పెరిగి కర్రలతో కొట్టుకున్నరు

తాండూర్, వెలుగు: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి తండాలో బుధవారం రెండువర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో నీళ్లపల్లి నుంచి బీఆర్ఎస్‎కు చెందిన వారు సర్పంచ్, ఉప సర్పంచ్‎గా గెలిచారు. మంగళ, బుధవారాల్లో తండాలో జరిగిన పెండ్లిళ్లకు బీఆర్ఎస్‎కు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్​కు చెందిన లీడర్లు కూడా పెండ్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా జరిగిన విషయాలపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

 ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో కట్టెలతో కొట్టుకున్నారు. దీంతో గ్రామం రణరంగంగా మారింది. ఈ గొడవలో సభావత్​ మోత్యానాయక్​వర్గానికి  చెందిన శంకర్ నాయక్(52) కు తల పగిలింది. దీంతో తాండూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, పోలీసులు మోత్యానాయక్​ వర్గానికి చెందిన ఏడుగురు, రమావత్​ బాబునాయక్​ వర్గానికి చెందిన ఏడుగురిపై  కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామని రూరల్​ సీఐ ప్రవీణ్ కుమార్​రెడ్డి  తెలిపారు.