లష్కర్​ బరిలో నగేశ్​ ముదిరాజ్!

లష్కర్​ బరిలో నగేశ్​ ముదిరాజ్!
  •     తర్వాతి వరుసలో దాసోజు శ్రవణ్​
  •     దానంకు దీటుగా బీసీ నేతను పోటీకి దింపాలని బీఆర్ఎస్ నిర్ణయం
  •     లోక్​సభ బరిలో దిగేందుకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ విముఖత
  •     గులాబీ బాస్ కేసీఆర్ కు ఫోన్​చేసి చెప్పినట్లు సమాచారం

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ లోక్​సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ హైకమాండ్​మల్లగుల్లాలు పడుతోంది. నిన్నటి దాకా అంతా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​పోటీ చేస్తారని భావించగా, అందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. గురువారం నేరుగా పార్టీ చీఫ్​కేసీఆర్ కు ఫోన్​చేసి విషయం చెప్పినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు సికింద్రాబాద్​బీఆర్ఎస్​అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, నగేశ్​ముదిరాజ్ కు ఆఫర్​ఇచ్చినట్లు తెలిసింది. అయితే దాసోజు శ్రవణ్ ఒకవేళ ఎన్నికలు వస్తే ఖైరతాబాద్​అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. 

దీంతో నగేశ్​ముదిరాజ్​కు లైన్​క్లియర్​అయింది. కాంగ్రెస్​అభ్యర్థి దానం నాగేందర్ పై బీసీ లీడర్​ని బరిలో నిలపడమే కరెక్ట్​అని బీఆర్ఎస్​హైకమాండ్​యోచిస్తోంది. గత లోకసభ ఎన్నికల్లో సికింద్రాబాద్​ స్థానం నుంచి బీఆర్ఎస్​అభ్యర్థిగా సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​కొడుకు సాయికిరణ్​యాదవ్​పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా సాయికిరణ్​బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే కొడుకుకు బదులుగా తలసాని శ్రీనివాస్​యాదవ్​నే పోటీ చేయాలని కేసీఆర్​కోరారు. 

అందుకు తలసాని ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా తన ఆలోచన మార్చుకోకపోవడంతో గులాబీ బాస్ దృష్టి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​పై పడింది. అయితే పద్మారావుగౌడ్​తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ కేసీఆర్​పద్మారావునే ఎన్నికల్లో తలపడమని చెప్పడంతో ఆయన కొంత తటపటాయించారు. ఈలోగా పద్మారావుగౌడ్​ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటూ సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలువురు బీఆర్ఎస్​నేతలు ఆయన్ని కలిసి శాలువాలు కప్పి, సన్మానాలు చేశారు. తాజాగా నగేశ్​ముదిరాజ్​పేరు తెరపైకి వచ్చింది.