మేం పదేండ్లలో సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు: కేటీఆర్

మేం పదేండ్లలో సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు: కేటీఆర్
  • రాజకీయ కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి.. కానీ 
  • కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపదను నిందించొద్దు: కేటీఆర్
  • ప్రాజెక్టుపై ఏ విచారణకైనా సిద్ధం
  • రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక
  • మేం చేసిన అప్పు 3.17లక్షల కోట్లు మాత్రమే.. 
  • కాంగ్రెస్​ సర్కారు 6.71లక్షల కోట్లని చెప్పింది
  • షాడో కేబినెట్.. షాడో టీమ్​లు ఏర్పాటు చేస్తమని వెల్లడి
  • గత బీఆర్​ఎస్​ పాలనపై స్వేదపత్రం రిలీజ్​

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడీషియల్​ ఎంక్వైరీయే కాదు.. ఏ విచారణకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​సవాల్​ విసిరారు. రాజకీయ కక్ష ఉంటే తమను తిట్టాలే కానీ కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపదను నిందించొద్దని అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తాము  చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోయామని, అందుకే ఆశించిన ఫలితాలు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించామని, ఈ ఓటమి స్పీడ్​బ్రేకర్​ మాత్రమేనని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్​ పాలనలో అభివృద్ధిపై ఆయన ఆదివారం తెలంగాణ భవన్​లో ‘స్వేదపత్రం’ పేరుతో పవర్​పాయింట్ ​ప్రజంటేషన్​ ఇచ్చారు. 

‘‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక మోటారును మేము నడిపించి ప్రారంభించినం. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మొత్తం మేమే చేశామని చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు తప్పుల తడకగా ఉన్నయి. కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు 412 హామీలు ఇచ్చింది. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం నాలిక మడతేశారు. కాంగ్రెస్​ప్రభుత్వ హామీల అమలు కోసం మా ఎమ్మెల్యేలతో షాడో కేబినెట్​ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ పరంగా షాడో టీమ్​లు ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకువస్తాం”అని తెలిపారు. 

కరువు రాష్ట్రాన్ని.. ప్రగతి వైపు నడిపించినం..

అసెంబ్లీలో కాంగ్రెస్ ​ప్రభుత్వం తమపై బురద జల్లే ప్రయత్నం చేసిందని కేటీఆర్​అన్నారు. సీనియర్​ నేతలు జగదీశ్ రెడ్డి, హరీశ్​రావు, తాను వాటిని తిప్పికొట్టామన్నారు. ప్రభుత్వం సమాధానాలు చెప్పలేక పారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేశామనే అపోహలు ప్రజల్లో సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకే ‘స్వేదపత్రం’ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పదేళ్ల పాటు చెమటోడ్చి, రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. కరువు, కల్లోల తెలంగాణను పదేళ్లలోనే ప్రగతి వైపు నడిపించామన్నారు. 

తెలంగాణను అస్థిరపరిచే కుట్ర..

తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించేందుకు అనేక కుట్రలు జరిగాయని తెలిపారు. బెర్లిన్​ గోడను కూల్చి ఈస్ట్​ వెస్ట్​బెర్లిన్​ ఒకటి అయినట్టు ఆంధ్ర, తెలంగాణ మళ్లీ కలిసి పోతాయన్నారని, ఎమ్మెల్యేలను కొని తెలంగాణను అస్థిర పరిచే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తాము తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కరోనా విపత్కర పరిస్థితులతో పాటు పెద్ద నోట్ల రద్దు లాంటి కారణాలతో ఆరున్నరేండ్లు మాత్రమే తమకు పని చేసే అవకాశం దక్కిందని, ఈ ఆరున్నరేళ్లలోనే 60 ఏండ్లలో చేయలేనిది చేసి చూపించామని చెప్పారు. తమ ప్రభుత్వ చర్యలతో 2013–14లో 21.92 శాతం ఉన్న పేదరికం 2022 –23 నాటికి 5.80 శాతానికి తగ్గిపోయిందన్నారు. ఎఫ్​ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పులు చేశామన్న కేటీఆర్.. తలసరి ఆదాయం రూ.1,12,162 నుంచి రూ.3,17,115కు, జీఎస్డీపీని రూ.4.51 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెంచినట్లు చెప్పుకొచ్చారు.

ఒక్క బ్యారేజీలో చిన్న లోపం..

ఇరిగేషన్ ​ప్రాజెక్టులపై రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కాల్వలు తవ్వితే కాళేశ్వరంతో పాటు కొత్త ప్రాజెక్టుల కింద రాబోయే రోజుల్లో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్​ లిఫ్ట్ ​ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలోనే పూర్తి చేశామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో చిన్నలోపం ఏర్పడితే మొత్తం ప్రాజెక్టు వేస్ట్​అనేలా మాట్లాడటం సరికాదన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.26,738 కోట్లు ఖర్చు చేశామన్నారు. 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని, 1,11,320 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్​ఇచ్చామని, ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకున్నారని సీఎం అసెంబ్లీలో చెప్పడం సరికాదన్నారు. 

 ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటం

రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం150కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ ​చెప్పారు. ఎస్సీల సంక్షేమానికి రూ.92,640 కోట్లు, ఎస్టీలకు రూ.43,936 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.61 వేల కోట్లు, కల్యాణ లక్ష్మికి రూ.11,743 కోట్లు, దివ్యాంగుల కోసం రూ.10,300 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే రూ.3.41 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు, నిరుద్యోగులకు1.60 లక్షల ఉద్యోగాలతో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచినా ఆ నిజాన్ని చెప్పుకోలేకపోయమన్నారు. హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల్లో రూ.9 వేల కోట్లతో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తే వాటి మార్కెట్​ విలువ రూ.50 వేల కోట్లుగా ఉందన్నారు. ఆస్తులు అంటే నిర్మాణాలు మాత్రమే కాదని, పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు కూడా అన్నారు. పదేళ్లలో సుమారు రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించామని, పాలన చేతకాక శ్వేతపత్రాలతో ఈ ప్రభుత్వం చేతులెత్తేసే ప్రయత్నం చేస్తోందన్నారు. తాము నిజాలు చెప్తున్నా.. కొన్ని యూట్యూబ్​ చానెళ్లు చేసిన అబద్ధపు ప్రచారాన్ని కొందరు నమ్మారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలిచ్చామని, అంతకుముందు 1నే జీతాలు ఇచ్చేవారిమని ​తెలిపారు.

అప్పు రూ. 3.17 లక్షల కోట్లే.. 

రాష్ట్ర బడ్జెట్ ​అప్పులు (ఎఫ్​ఆర్బీఎం పరిమితికి లోబడి) రూ.3,89,673 కోట్లుగా ప్రభుత్వ శ్వేతపత్రంలో చూపించారని, అందులో రూ.72,658 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచే తెలంగాణకు అప్పులుగా వచ్చాయని కేటీఆర్​తెలిపారు. వాటిని మినహాయిస్తే తమ ప్రభుత్వం రూ.3.17 లక్షల కోట్ల రుణాలు మాత్రమే చేసిందన్నారు. సివిల్​ సప్లయ్స్​కార్పొరేషన్​ లోన్లు రూ.21,229 కోట్లే అయితే, ప్రభుత్వం శ్వేతపత్రంలో రూ.56,146 కోట్లుగా చూపించిందని విమర్శించారు. కార్పొరేషన్లు తమ సొంత పరపతితో తిరిగి చెల్లించే లోన్లను ప్రభుత్వ అప్పుల్లో జమ చేసి, మొత్తం అప్పును రూ.6,71,757 కోట్లుగా చూపించారని ​మండిపడ్డారు. ఆర్టీసీ సంస్థ తమ ఆస్తులను కుదవ పెట్టుకొని రుణాలు తెచ్చుకుందే తప్ప అవి ప్రభుత్వం చేసిన రుణాలు కావన్నారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా కింద 41.68% నిధుల లెక్కన రూ.4,98,053 కోట్లు ఇచ్చామని శ్వేతపత్రంలో చెప్పారని, అది నిజం కాదని చెప్పారు. తమ పాలనలో రూ.13,72,930 కోట్లు ఖర్చు చేశామని, విద్యుత్​ రంగంపై రూ.1,37,517 కోట్లు ఖర్చు చేసి, రూ.6,87,585 కోట్ల ఆస్తులు సృష్టించినట్లు తెలిపారు. స్థాపిత విద్యుత్​సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని, వచ్చే ఏడాది యాదాద్రి పవర్​ ప్లాంట్​అందుబాటులోకి వస్తే స్థాపిత విద్యుత్​సామర్థ్యం 26 వేల మెగావాట్లకు చేరుతుందన్నారు.