నాడు కేసీఆర్‌ను తిట్టి.. ఇప్పుడు జై కొట్టి..
అప్పుడు వీ6 సూపర్ అన్నవ్..
ఇప్పుడు ఆ చానల్ చూడొద్దంటున్నవ్..
నీకు జై అంటే సై.. లేకుంటే నై.. అంతేనా?
కేసీఆర్ దొర అన్నవ్.. రాజ్యాంగం నిర్వీర్యమైందన్నవ్.
నియంత.. కుటుంబ పాలన అని విమర్శించినవ్
ఇప్పడు జాతిపిత అంటున్నవ్..
అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్లా
మీ స్వరం మారింది.. జనం గమనిస్తున్నరు.
పెడితే పెండ్లి కోరడం లేదంటే సావు కోరడం ఇది మన దగ్గర సామెత..! బీఆర్ఎస్ నేత, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి అలాగే ఉంది. ఓడ దాటాక తెప్పను తగలేసినట్టు ఉన్న ఆయన వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అప్పుడు వీ6 జనం గొంతుకన్న ఆర్ఎస్పీ.. బీఆర్ఎస్ పార్టీలో చేరగానే స్వరం మార్చారు. విశాఖ రేకులు కొనొద్దు.. వీ6 చానల్ చూడొద్దంటూ ఏకంగా ట్వీట్ చేసేశారు.
స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ బీఎస్పీలో చేరి ఆ పార్టీ స్టేట్ చీఫ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కేసీఆర్ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.
కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ ఊరూరా తిరిగి నిప్పులు చెరిగారు.. కేసీఆర్ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే మోసం చేశారని విమర్శించారు. కాళేశ్వరం స్కాం అని.. ప్రజాధనం దుర్వినియోగం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వీ6 చానల్, వెలుగు పత్రిక తెలంగాణకు అవసరమని, వీ6 చానల్ ఉండటం వల్లే నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయంటూ కితాబు ఇచ్చారు.
బడుగు, బలహీన వర్గాల గొంతుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న మీడియా తెలంగాణలో ఏదైనా ఉందంటే, అది వీ6, వెలుగు మాత్రమే అని ఎవరైనా చెపుతారు. ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బహుజన నేతగా ప్రపంచానికి చూపింది. ఇదంతా భరించలేని బీఆర్ఎస్ పాలకుల చేత వీ6 వెలుగు నిషేధానికి గురైంది. ఆర్ఎస్పీ రాజ్యాధికార యాత్రను ప్రపంచానికి చూపింది వీ6 వెలుగు మీడియానే.
ఇవాళ అదే రాజ్యాధికార యాత్రకు ఎగనామం పెట్టి... దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని దగా చేసిన దొర పంచన చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలను తెలంగాణలో ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా ? నేతగా ఆయనను ప్రపంచానికి చూపిన మీడియా సంస్థను నిందించడానికి మించిన దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటదా? ఎవరినైతే దొర అన్నారో.. ఇపుడా దొర పంచన నిలబడి.. వీ6 వెలుగును చూడొద్దు, చదువొద్దంటే అంతకు మించిన ఆత్మవంచన ఏముంటుంది?
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, రాజ్యాధికార ఉద్యమాన్ని పక్కన పడేసి, దొర పార్టీలో చేరిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ క్యారెక్టర్‌కు, ఆయన యూటర్న్ మాటలకు తెలంగాణలో విలువెక్కడ? వీ6 వెలుగు అంటేనే తెలంగాణ ఆత్మ. దాన్ని చూడకుండా, చదవకుండా ఆపడం ఆర్ఎస్పీ లాంటి వారి తరమా!
అప్పుడు:
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇసుక దందా
కేసీఆర్ అవినీతిలో ఆ పార్టీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రాజెక్టు, పథకాల్లో విచ్చలవిడిగా అవినీతి జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా ఇసుక దందా చేస్తుండ్రు. సీఎంగా కేసీఆర్ నెలకు రూ.3.36లక్షల జీతం తీసుకుంటుంటే, అసంఘటిత కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నరు.
జులై 7, 2023, జ్యోతి నగర్
కేసీఆర్, హరీశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలె
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిన ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుతోపాటు అప్పటి చీఫ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దేశద్రోహం కేసు పెట్టాలె. వాళ్ల ఆస్తుల్ని తెలంగాణపరం చేయాలి. కేసీఆర్ ఇంజినీరు కాకపోయినా... కమీషన్ల కోసం ఆయనే సర్వే చేసి, ప్లానింగ్, డిజైనింగ్ చేసి కాళేవ్వరం కట్టి ప్రారంభించారు. ఇదేం నియంతృత్వం.
23, అక్టోబర్ 2023, హైదరాబాద్
కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్
తెలంగాణ అంటే కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్.. అన్నట్లు తయ్యారైంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకుపోయారు.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెతను నిజం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పడి దోచుకుంటున్నారు.
25 ఏప్రిల్ 2022, రాజ్యాధికార యాత్ర కోదాడ, సూర్యాపేట జిల్లా
ఇప్పుడు:
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు
దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయడం చట్టబద్ధమే. అన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ జరగటం లేదన్నారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నిజమైన బాధితులు. ట్యాపింగ్ అనేది నేరమే కాదు.
23 జనవరి 2026, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్
కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాళేశ్వరం కుట్ర
కేసీఆర్‌ను గద్దె దింపడం కోసం మేడిగడ్డపై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేశాయి. మేడిగడ్డ కుంగినప్పుడు భారీ శబ్దాలు వచ్చాయి. మహదేవ్ పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఈఈ ఫిర్యాదు చేశారు. బ్యారేజీ కుంగడం వెనుక అసాంఘిక శక్తులున్నాయి. ఆ అసాంఘిక శక్తులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డి లేమో తేల్చాలె.
16 ఆగస్టు, 2025, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్
కేసీఆర్ తెలంగాణ జాతిపిత
కేసీఆర్.. తెలంగాణ జాతిపిత. తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికం. 14 ఏండ్లు మడమతిప్పని పోరాటం చేసి తెలంగాణ తేవడమే కేసీఆర్ చేసిన నేరమా..? రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. కేసీఆర్ ఎంతో శ్రమకోర్చి, ఉద్యమం చేసి.. 1300 మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ నేడు దొంగల, రాబంధుల పాలైంది.
17 ఫిబ్రవరి, 2026
కేసీఆర్‌పై ప్రవీణ్ కుమార్ విమర్శలు
* 09-08-2022: దళిత బంధు పథకం ఎన్నికల కోసం నాటకమని, దళితులకు నిజమైన లాభం లేదని వ్యాఖ్య.
* 02-10-2022: రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు నిర్వీర్యమయ్యాయని, పాలన కుటుంబ కేంద్రీకృతమైందని విమర్శ.
* 18-11-2022: దళిత ఉపప్రణాళిక నిధులు దారి మళ్లించారని కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణ.
* 26-01-2023: రిపబ్లిక్ డే సందర్భంగా.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని వ్యాఖ్య.
* 14-04-2023: అంబేద్కర్ జయంతి సభలో.. కేసీఆర్ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే మోసం చేశారని విమర్శ.
* 05-06-2023: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల హామీలు గాలిలో కలిసిపోయాయని ఆరోపణ.
* 21-07-2023: కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం వృథా చేశారని విమర్శ.
* 02-10-2023: గాంధీ జయంతి సందర్భంగా రైతుబంధు ధనిక రైతులకే పరిమితమైందని వ్యాఖ్య.
* 15-11-2023: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాటలు ఒకటి, చేతలు ఇంకొకటని ఘాటు విమర్శ.
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు
