మీ వల్లే మా భవిష్యత్తు బుగ్గిపాలైంది.. తమిళిసైకి దాసోజు, కుర్రా బహిరంగ లేఖ

మీ వల్లే మా భవిష్యత్తు బుగ్గిపాలైంది.. తమిళిసైకి దాసోజు, కుర్రా బహిరంగ లేఖ

వెలుగు, హైదరాబాద్ :  గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన వేళ.. బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఆమెకు బహిరంగ లేఖ రాశారు. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ భవిష్యత్తు బుగ్గిపాలైందని ఘాటైన విమర్శలు చేశారు. రానున్న లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆమెకు ఒకవైపు శుభాకాంక్షలు చెబుతూనే.. మరోవైపు తమకు తీరని అన్యాయం చేశారని లేఖలో పేర్కొన్నారు. 'మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు మా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాం' అంటూ రాసుకొచ్చారు. 

తమ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని.. రాజ్యాంగాన్ని కాపాడాలని, తమ లాంటి వెనుకబడినవర్గాలకు చెందినవారికి న్యాయం చేయాలని చేతులు జోడించి నమస్కరించినా.. గవర్నర్ హోదాలో తమిళిసై అలక్ష్యం చేశారని ఆరోపించారు. చట్ట విరుద్ధమైన తన నిర్ణయాన్ని సరిదిద్దుకోలేదన్నారు. 'అపరిపక్వ, తప్పుడు న్యాయ సలహాపై మీరు ఆధారపడటం, తద్వారా మీరు తీసుకున్న వివాదాస్పద రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కారణంగా బడుగుబలహీన వర్గాలకు చెందిన మాకు తీరని అన్యాయం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయన్న కారణంతో తమ రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారనే విషయాన్ని గుర్తిస్తూ.. ఆత్మ శోధన చేసుకోవాలి” అని ఆ ఇద్దరు నేతలు లేఖలో పేర్కొన్నారు.