Rishab Shetty: 'కాంతార' ఎమోషన్‌తో ఆటలాడకండి.. రణ్‌వీర్ సింగ్ తీరుపై రిషబ్ శెట్టి ఘాటు వ్యాఖ్యలు!

Rishab Shetty: 'కాంతార' ఎమోషన్‌తో ఆటలాడకండి.. రణ్‌వీర్ సింగ్ తీరుపై రిషబ్ శెట్టి ఘాటు వ్యాఖ్యలు!

భారతీయ చిత్ర పరిశ్రమలో 'కాంతార' ఒక సంచలనం. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇది కేవలం సినిమాగానే కాకుండా, ఒక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ చిత్రంపై కన్నడ ప్రజలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలోని 'వరాహ రూపం' సన్నివేశంలో రిషబ్ శెట్టి చేసే విలక్షణమైన శబ్దాన్ని, హావభావాలను వేదికపై ఇమిటేట్ చేశారు. ఇది చూసిన కన్నడిగులు రణ్‌వీర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిషబ్ శెట్టి ఘాటు వ్యాఖ్యలు

ఈ వివాదంపై లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మనసు విప్పి మాట్లాడారు. రణ్‌వీర్ సింగ్ చేసిన పని తనకు ఏమాత్రం నచ్చలేదని ఆయన బాహాటంగానే చెప్పారు. రణ్‌వీర్ అలా చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. కాంతార అనేది కేవలం మాస్ మసాలా సినిమా కాదు. అది దైవిక అంశాలతో రూపొందిన చిత్రం. ఆ సన్నివేశంతో మా ప్రజలకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా.. ఈ సినిమాలోని సన్నివేశాలను వేదికలపై హాస్యాస్పదంగా ఇమిటేట్ చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంటాను. అది మా విశ్వాసం, మా సంస్కృతి అని రిషబ్ స్పష్టం చేశారు.

సారీ చెప్పిన రణ్‌వీర్ సింగ్

కన్నడ ప్రజల నుంచి, రిషబ్ శెట్టి నుంచి విమర్శలు రావడంతో రణ్‌వీర్ సింగ్ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. రిషబ్ శెట్టి ఆ పాత్రను ఎంత అద్భుతంగా చేశారో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను అలా చేశాను. అటువంటి కష్టమైన సన్నివేశాల్లో నటించడం ఎంత సవాలుతో కూడుకున్నదో నాకు తెలుసు. రిషబ్ ప్రతిభ అంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలోని అన్ని సంప్రదాయాల పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. నా చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను అంటూ రణ్‌వీర్ తన వివరణ ఇచ్చారు.

'కాంతార' సినిమాలో కనిపించే భూతకోల అనేది కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా భావించే ఆచారం. దైవం ఆవహించినప్పుడు చేసే ఆ శబ్దాన్ని కేవలం వినోదం కోసం వాడటం అక్కడి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కొందరు యూట్యూబర్లు, సెలబ్రిటీలు ఈ సీన్‌ను ఇమిటేట్ చేసినప్పుడు రిషబ్ శెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు.