- మార్చి చివరి నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలకు సర్కారు నిర్ణయం
- హడ్కో నుంచి రూ.5 వేల కోట్ల లోన్ మంజూరు
- కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల వినియోగం
- బడ్జెట్లో హౌసింగ్‌కు రూ.12 వేల కోట్లు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్ కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ స్కీమ్ కు నిధుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. స్కీమ్ అమలు కోసం హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.5 వేల కోట్ల లోన్ తీసుకుంది. వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ కింద అన్ని రాష్ట్రాలకు తక్కువ వడ్డీకి హడ్కో అప్పులు ఇస్తున్నది. త్వరలో కేబినెట్ ఆమోదించిన తరువాత ఈ నిధులు లబ్ధిదారులకు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ స్కీమ్ తో పాటు జీహెచ్ఎంసీ, అర్బన్ ఏరియాల్లో టవర్ల పద్ధతిలో కట్టనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఈ ఫండ్స్ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తున్నది.
మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1లక్ష 48 వేల ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 60 వేల ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చ్ చివరి నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేసిలబ్ధిదారులకు వాళ్ల ఇంటి స్టేటస్ ను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు గ్రీన్ చానెల్ ద్వారా దశల వారీగా సాయాన్ని వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. స్కీమ్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.3,500 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలని ప్రభుత్వం హౌసింగ్ అధికారులకు స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా హౌసింగ్ శాఖ సెక్రటరీ, కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్.. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ స్టేటస్ తెలుసుకుంటున్నారు. పీడీలు సమస్యలను ప్రస్తావిస్తే కలెక్టర్లతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు.
బడ్జెట్ కేటాయించి రిలీజ్ చేయట్లే
ఈ ఆర్థిక సంవత్సరానికి హౌసింగ్ శాఖకు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.200 కోట్ల లోపే ఫండ్స్ రిలీజ్ చేసిందని హౌసింగ్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. స్కీమ్ అంతా హడ్కో లోన్, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు భూముల వేలం ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారా అమలు అవుతున్నదంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 3 నెలలు మాత్రమే టైమ్ ఉందని, బడ్జెట్ నిధులు రిలీజ్ చేస్తే ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఇండ్ల కంటే ఎక్కువ ఇండ్లు పూర్తి చేయెచ్చని ఆ అధికారి వ్యాఖ్యానించారు.
