ధురంధర్ 2 తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సిల్..!

ధురంధర్ 2 తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సిల్..!

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్’ సినిమా తెలుగు ప్రీమియర్ షోలు దాదాపు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీ వెర్షన్ కంటెంట్ ఆలస్యంగా చేరడం, తెలుగు వెర్షన్ కంటెంట్ ఇంకా రెడీ కాకపోవడం వల్ల బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పడాల్సిన ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. హిందీ వెర్షన్ షోలు కూడా ఆలస్యంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ కంటెంట్ కష్టాల వల్ల ఈ మధ్య చాలా సినిమాలు ఈ సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ అయిన రోజే ప్రీమియర్ షో టికెట్లను అందుబాటులో ఉంచారు.

ధురంధర్ ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులు భారీ అంచనాలతో టికెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్లోని చాలా థియేటర్లలో ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్లు గట్టిగా బుక్ అవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు వెర్షన్ ప్రీమియర్ షో క్యాన్సిల్ అనే ప్రచారం టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. బుకింగ్ డబ్బులు రిఫండ్ ఇస్తున్నప్పటికీ సినిమా కోసం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిందని ప్రేక్షకులు ధురంధర్ 2 మేకర్స్పై కారాలుమిరియాలు నూరుతున్నారు.

గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ధురంధర్ సినిమా పదమూడు వందల కోట్లకు పైగా పసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా 'ధురంధర్’ రివేంజ్ సినిమా వస్తుండటం గమనార్హం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్కు రెడీ అవుతోంది. మార్చి 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈద్, ఉగాది పండుగల సెలవులు కలిసొచ్చే అంశం. ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నా పాత్ర చనిపోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, మాధవన్, రాకేష్ బేడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జ్యోతిదేశ్ పాండే, లోకేష్ ధర్ నిర్మిస్తున్నారు.