ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధంతో క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పశ్చిమాసియా సెగలు ఇప్పుడు నేరుగా భారతీయ వంటింట్లోకి చేరాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రతరమైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. టేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
అక్షయ్ కుమార్ 'బ్యాకప్' ప్లాన్
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్, గ్యాస్ కొరతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి మా ఇంట్లో గ్యాస్ కొరత లేదు కానీ, ముందు జాగ్రత్తగా నా భార్య ట్వింకిల్ ఖన్నా ఇప్పటికే రెండు ఇండక్షన్ స్టవ్‌లను (Electric Stoves) ఆర్డర్ చేసింది. అవి ఇంటికి డెలివరీ అయ్యాయో లేదో నాకు తెలియదు కానీ, ఏదైనా ఇబ్బంది వస్తే సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. కేవలం అక్షయ్ మాత్రమే కాదు, మీరు కూడా ఇలాంటి బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోవడం మంచిదని అభిమానులకు చమత్కారంగా సలహా ఇచ్చారు.
కట్టెల పొయ్యిలే దిక్కు!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో భారత్‌లోకి వచ్చే ఎల్పీజీ దిగుమతులు నెమ్మదించాయి. దీని ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. నగరాల్లోని అనేక రెస్టారెంట్లు గ్యాస్ అందక కట్టెల పొయ్యిలు, బొగ్గు కుంపట్లను మళ్ళీ బయటకు తీస్తున్నాయి. కొన్ని హోటళ్లు అయితే మూతబడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గించి గృహావసరాలకు మాత్రమే ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. మరో వైపు ఎలక్ట్రానిక్ షాపుల్లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. సిలిండర్ బుక్ చేసినా డెలివరీకి వారం పది రోజులు పడుతుండటంతో మధ్యతరగతి ప్రజలు ఇండక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా..
ప్రస్తుతం వరుస సినిమాలతో అక్షయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 10న విడుదల కానుంది. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనితో పాటు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న మల్టీస్టారర్ 'గోల్‌మాల్ 5' లో కూడా అక్షయ్ మెరవనున్నారు.
సమకాలీన సినిమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని, రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' వంటి మాస్ యాక్షన్ సినిమాలతో పాటు 'స్త్రీ' వంటి హారర్ కామెడీలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని అక్షయ్ విశ్లేషించారు. మొత్తానికి యుద్ధం తెచ్చిన తిప్పలు అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలను కూడా "స్టవ్"ల గురించి ఆలోచించేలా చేశాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
