యష్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. చిన్న కిరాణా కొట్టులో ఐస్ క్యాండీ కొంటున్న ఫోటో వైరల్!

యష్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. చిన్న కిరాణా కొట్టులో ఐస్ క్యాండీ కొంటున్న ఫోటో వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి 'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నటుడు యష్. వెండితెరపై 'రాకీ భాయ్'గా గంభీరమైన పాత్రలో కనిపించే యష్, నిజ జీవితంలో మాత్రం అత్యంత సాధారణ వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతారు. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఆయనలోని ఆ సాదాసీదా కోణాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

సామాన్యుడిలా కిరాణా షాపులో ..

కోట్ల రూపాయల పారితోషికం, దేశవ్యాప్త గుర్తింపు ఉన్నప్పటికీ, యష్ తన మూలాలను మర్చిపోలేదని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాత ఫోటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 2024లో ఆయన తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని శిరాలీలో ఉన్న చిత్రాపూర్ మఠాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మఠం సందర్శన ముగించుకుని తిరిగి వస్తుండగా, యష్ ఒక చిన్న రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాపు వద్ద ఆగారు.

అక్కడ ఎంతో క్యాజువల్‌గా నిలబడి, తన పిల్లల కోసం ఐస్ క్యాండీ (పుల్ల ఐస్) కొంటున్న ఫోటో ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంది. లావెండర్ షర్ట్ ధరించి, జుట్టును పోనీటైల్‌లా కట్టుకుని ఉన్న యష్, పక్కనే పింక్ చురీదార్‌లో కూర్చుని ఉన్న ఆయన భార్య రాధికా పండిట్.. ఈ ఫోటోలో చూస్తుంటే వీరు ఒక సూపర్ స్టార్ ఫ్యామిలీలా కాకుండా, మన పక్కింటి వారిలాగే ఎంతో సహజంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల ఫిదా..

ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెరపై రారాజు.. నిజ జీవితంలో సామాన్యుడు అని ఒకరు కామెంట్ చేయగా, స్టార్‌డమ్ తలకెక్కని వ్యక్తి యష్ అని మరొకరు కొనియాడారు. మనలాగే కిరాణా కొట్టులో ఐస్ కొంటున్న యష్ బాస్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తన హోదాను పక్కన పెట్టి, రోడ్డు పక్కన షాపులో చిన్న పిల్లల కోసం సమయం గడపడం యష్ సంస్కారానికి నిదర్శనమని సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.

 

యష్ లైనప్ చూస్తే ..

కేజీఎఫ్-2 తర్వాత యష్ మరే సినిమా విడుదల చేయలేదు, కానీ ఆయన లైనప్ చూస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ డ్రామా చిత్రం టాక్సిక్ (Toxic)పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 4, 2026న విడుదల కానుంది. ఇందులో యష్ లుక్ మునుపటి కంటే చాలా భిన్నంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తుంది.  నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణ (Ramayana) చిత్రంలో యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రావణుడి పాత్ర కోసం యష్ పడుతున్న శ్రమ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.