మరో వివాదంలో NCERT.. హిస్టరీ మ్యాప్ తప్పిదంపై రాజకుటుంబం ఫైర్

మరో వివాదంలో NCERT.. హిస్టరీ మ్యాప్ తప్పిదంపై రాజకుటుంబం ఫైర్

భారతీయ విద్యా వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాల్సిన NCERT మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గతంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పాఠ్యాంశాల మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే.. ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో ఒక 'మ్యాప్' తప్పు విద్యావేత్తలు, చరిత్రకారుల మధ్య కొత్త చర్చకు దారితీసింది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జైసల్మేర్ సంస్థానాన్ని మరాఠా సామ్రాజ్యంలో భాగంగా చూపడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ రాజకుటుంబానికి చెందిన చైతన్య రాజ్ సింగ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జైసల్మేర్ చరిత్రలో మరాఠాల ఆధిపత్యం కానీ, వారి పన్నుల వసూళ్లు కానీ ఎక్కడా లేవని, ఇది పూర్తిగా చారిత్రక తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం తమ పూర్వీకుల త్యాగాలను, శౌర్యాన్ని అవమానించడమేనన్నారు. ఇది జాతీయ పాఠ్యప్రణాళిక విశ్వసనీయతకే ప్రశ్నార్థకం అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదం ముదరడంతో.. NCERT తక్షణమే స్పందించి 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిజిటల్ పాఠ్యపుస్తకాల నుంచి ఆ వివాదాస్పద మ్యాప్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రాజకుటుంబీకులు స్వాగతించినప్పటికీ, విమర్శలు మాత్రం ఆగడం లేదు. జైసల్మేర్ ఫోర్ట్ ప్యాలెస్ మ్యూజియం డైరెక్టర్ దేవేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. మ్యాప్‌ను తొలగించడం మంచిదే కానీ.. ఇన్నాళ్లూ విద్యార్థులకు తప్పుడు సమాచారం అందించినందుకు NCERT క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వరుసగా జరుగుతున్న ఈ సిలబస్ మార్పులు.. చారిత్రక తప్పిదాలు NCERT పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గతంలో న్యాయవ్యవస్థపై ఉన్న పాఠాలను తొలగించినప్పుడు రాజ్యాంగ నిపుణులు పెదవి విరిచారు. ఇప్పుడు చారిత్రక వాస్తవాలను వక్రీకరించడంపై సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థలు కేవలం సిలబస్ పూర్తి చేయడంపైనే కాకుండా, విద్యార్థులకు అందించే విద్యా ప్రామాణికతపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.