నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‎ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‎ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. ఇందల్వాయి మండలం దేవి తాండ సమీపంలోని నేషనల్ హైవే–44 పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సల్మాన్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కాల్చారు గుర్తు తెలియని దుండగులు. పెట్రోల్ బంక్‌లో సల్మాన్ లారీ నిలిపి ఉంచగా వేరే లారీలో వచ్చి కాల్పులు జరిపారు ముగ్గురు దుండగులు.

దీంతో డ్రైవర్ సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్లి ఓ దాబా దగ్గర లారీ వదిలి అడవిలోకి పరారయ్యారు దుండగులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సల్మాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో నేషనల్ హైవే–44పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు.