గాంధీ హాస్పిటల్​పై డీప్​ ఫేక్ ​వీడియో.. పోస్ట్ చేసిన బీఆర్ఎస్ నేత హరీశ్​రెడ్డి

గాంధీ హాస్పిటల్​పై డీప్​ ఫేక్ ​వీడియో.. పోస్ట్ చేసిన బీఆర్ఎస్ నేత హరీశ్​రెడ్డి
  • స్పందించిన సీఎం పేషీ.. వీడియో ఫేక్ అని నిర్ధారణ
  • ఎక్స్​లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్(యూఎస్ఏ) అకౌంట్ నిర్వాహకుడిపై 
  • కేసు నమోదు ఆస్పత్రి ప్రతిష్టను 
  • దెబ్బ తీయొద్దని కోరిన గాంధీ సూపరింటెండెంట్

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను బీఆర్ఎస్(యూఎస్ఏ) తన ఎక్స్ అకౌంట్ నుంచి తొలిగించింది. పొరపాటున పాత వీడియోను పోస్టు చేసినట్లు బీఆర్ఎస్(యూఎస్ఏ) అకౌంట్ నిర్వాహకుడు హరీశ్​రెడ్డి వెల్లడించారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ ఎక్స్​లో మంగళవారం మరో వీడియో పోస్టు చేశారు. పొరపాటును గమనించి వెంటనే తన ఎక్స్​అకౌంట్ నుంచి వీడియోను డిలీట్ చేశానని వివరించారు.

అయినా, కాంగ్రెస్​ నేతల ఒత్తిడితో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తనపై కేసు పెట్టారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడం కాదని, కోట్లాది మంది ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపైనే ముందు కేసు పెట్టాలని హరీశ్​రెడ్డి పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే?

రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వ పనితీరు దరిద్రంగా ఉందని, సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ హరీశ్​రెడ్డి.. మూడు రోజుల కింద గాంధీ ఆస్పత్రిపై ఓ వీడియోను ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీనిపై సీఎం ఆఫీస్​ఎంక్వైరీ చేపట్టగా.. వీడియోలో ఉన్నది నిజం కాదని తేలింది. పాత క్లిప్పింగ్​లతో డీప్​ఫేక్​ద్వారా తప్పుడు వీడియోను క్రియేట్​ చేశారని నిర్ధారణ అయ్యింది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​రాజారావు చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

హరీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదుతో ఐటీ, ఐపీసీ 505 క్లాజ్2 సెక్షన్ల కింద హరీశ్​ రెడ్డిపై సైబర్ క్రైమ్​ కేసు నమోదు చేశారు. హరీశ్​రెడ్డి అమెరికా నుంచి ఇండియాకు రాగానే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సెక్షన్ల కింద హరీశ్​రెడ్డికి ఐదేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  

గాంధీ ఆస్పత్రిపై నిందలు సరికాదు

పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఓ దేవాలయంగా పనిచేస్తున్న గాంధీ ఆస్పత్రిపై కొందరు పనిగట్టుకొని నిందలు వేయడం సరికాదు. పేదలకు కార్పొరేట్​స్థాయి వైద్యం అందిస్తూ, వారి ప్రాణాలను కాపాడుతున్నాం. కరోనా టైంలో బెడ్​లు సరిపోలేనంత పేషెంట్లు వచ్చినప్పటికీ మా వైద్య సిబ్బంది అక్కున చేర్చుకుంది. తమ ప్రాణాలను తెగించి, పేషెంట్లను కాపాడిన సంగతి తెలియంది కాదు. వైద్య సిబ్బందిని ప్రోత్సహించాల్సింది పోయి , వారిపై ఫేక్​ అలిగేషన్స్​చేస్తున్నారు. ఇలాంటి పనులతో డాక్టర్ల మనోదైర్యాన్ని, ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయకండి.  

 ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​