జగన్ ఓ నియంత.. మోత్కుపల్లి తీవ్ర విమర్శలు

జగన్ ఓ నియంత.. మోత్కుపల్లి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. జగన్ ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మోత్కుపల్లి ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి.. చంద్రబాబును తన  పెళ్లి రోజు అరెస్ట్ చేసి  జగన్ ఆనందం   పొందుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు నారా భువనేశ్వరి ఉసురు తగుల్తుందంటూ మండిపడ్డారు.

ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటం లేదని మోత్కుపల్లి విమర్శించారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరులేని చంద్రబాబును అరెస్టే చేయడం దారుణమన్నారు. జగన్ కు వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు కాదు 4 సీట్లు కూడా రావన్నారు.  అమ్మను, తల్లిని ఎన్నికల కోసం వాడుకుని బయటకు నెట్టేసిన దారుణమైన చరిత్ర జగన్ దన్నారు.  ఆస్తులివ్వకుండా జగన్ తన చెల్లెను  కట్టుబట్టలతో బయటకు పంపించాడని ఆరోపించారు. 

ఏపీలో జగన్ ప్రవర్తను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు మోత్కుపల్లి. దమ్ముంటే లోకేష్ ను అరెస్ట్ చేయాలన్నారు. లోకేష్ ను అరెస్ట్ చేస్తే  ప్రజలు తిరగబడాలన్నారు. జగన్ తన ఆలోచన మార్చుకోకుంటే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.  క్షమాపలు చెప్పే మార్గం తప్ప జగన్ కు వేరే దారి లేదన్నారు. చంద్రబాబు తనకు అన్నలాంటి వాడని.. 40 ఏళ్లు ఒకే జెండా పట్టుకుని తిరిగామన్నారు. ఆయన జైల్లో పెడితే తనకు బాధగా ఉందన్నారు.