
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకుంటే ‘మా పార్టీకి పట్టిన గతే పడుతుంది’ అని బీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లిలోని బర్కల రాంరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చేవెళ్లలో రెండుసార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేను గెలిపించిన ఘనత నియోజకవర్గ ప్రజలదేనని ప్రశంసించారు. ఎన్నికల ముందు, తర్వాత పార్టీలు మారడంతో చేవెళ్లలో అనిశ్చితి, అయోమయం నెలకొందని, ప్రజాప్రతినిధులకు, నేతలకు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు తామున్నామని స్పష్టం చేశారు.
ఎలాంటి అనుమానాలొద్దు చేవెళ్లలో బీఆర్ఎస్ మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి , రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పులుమామిడి నారాయణ, బీఆర్ఎస్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరత్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.