మిగిలేది ఆరుగురేనా.. లెక్కలేసుకుంటున్న కేసీఆర్

మిగిలేది ఆరుగురేనా.. లెక్కలేసుకుంటున్న కేసీఆర్
  •  గులాబీ గూటిలో ఉండేదెవరు
  •  ఫాంహౌస్ కు పిలిచి మాట్లాడుతున్న మాజీ సీఎం
  •  విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఎమ్మెల్యేల పక్కచూపులు!
  •  కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు కమలానికి!
  •  రకరకాల ఈక్వేషన్లతో పార్టీ చేంజ్!
  •  బీఆర్ఎస్ వర్గాల్లో చేరికలపై జోరుగా చర్చ

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసినట్టు ప్రకటించిన తర్వాత ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగతా వారు కూడా పార్టీ మారుతారనేది హాట్ టాపిక్ గా మారింది.  చేరికలు ఊపందుకోండంతో మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫాంహౌస్ కు పిలిపించుకొని చర్చిస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు ఉందని, ఎవరూ వెళ్లొద్దని అభయం ఇస్తున్నారు. ఫాంహౌస్ కు వచ్చిన ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే పక్కచూపులు చూస్తున్నారనే చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా వలసలకు బ్రేక్‌ వేసేందుకు గులాబీ బాస్ డే అండ్ నైట్ వర్కవుట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వీడిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఇద్దరు సీనియర్ వ్యాదులతోపాటు హైదరాబాద్ లోని పార్టీ లీగల్ సెల్ సభ్యులతో కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. 

ఎమ్మెల్యే ఫిరాయింపుపై మొదట్లో లైట్ తీసుకున్న గులాబీ బాస్ ఇప్పుడు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని.. పార్టీ మారాలంటే ఓ భయం ఉండాలని అంటున్నట్టు పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులే పార్టీ వీడితే సాధారణ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటన్న భావన కేసీఆర్ ను వెంటాడుతోందని తెలుస్తోంది. ఇదే క్రమంలో కారులో మిగిలేది ఆ ఆరుగురేననే ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. తనతో ఎవరుంటారు..? ఎవరు వీడుతారనే అంశంలో గులాబీ బాస్ కూడా ఫుల్ క్లారిటీతోనే ఉన్నారని బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతోపాటు అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే, ఉమ్మడి కరీంనగర్  నుంచి ఒకరు, ఉమ్మడి వరంగల్ జిల్లా  నుంచి మరో ఎమ్మెల్యే మాత్రమే బీఆర్ఎస్ లో ఉంటారనే ప్రచారం సాగుతోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో బై ఎలక్షన్ జరగగా ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలిచారు. దీంతో బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు( భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ) సంజయ్ కుమార్(జగిత్యాల) ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మిగతా వారు కూడా పార్టీ మారే అవకాశ ఉందని తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండగా మరికొందరు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబర్చుతున్నట్టు సమాచారం. రక రకాల ఈక్వేషన్లతో పార్టీ చేంజ్ అయితే కారు పార్టీలో మిగిలేది ఆరుగురేననేది హాట్ టాపిక్ గా మారింది. మిగతా చేరికలు ఎప్పుడు, ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

మామా అల్లుండ్ల దారెటు

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మామా అల్లుండ్లు చెరో పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఒకరు బీజేపీలో జాయినింగ్ కు ఆసక్తి చూపుతుండగా మరొకరు కాంగ్రెస్ కండువా కప్పుకొందామని పట్టుబడుతున్నారట. ఏది ఏమైనా వీళ్లిద్దరూ పార్టీ వీడడం దాదాపు ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.