ఎనిమిది స్థానాల్లో బీఆర్‌‌ఎస్ డిపాజిట్ గల్లంతు

ఎనిమిది స్థానాల్లో బీఆర్‌‌ఎస్ డిపాజిట్ గల్లంతు

హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ ఘోర పరాజయం పాలైంది. ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌‌, ఆదిలాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు ఈ లిస్టులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ బ్రహ్మ రథం పట్టిన గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సీట్లలో బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా, ఆ నియోజకవర్గాల్లో బీఆర్‌‌ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌‌ఎస్‌కు కనీసం 20 వేల ఓట్లు కూడా రాలేదు. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 18,641 ఓట్లు మాత్రమే దక్కాయి. ఖమ్మం, మహబూబాబాద్‌లో బీఆర్‌‌ఎస్‌కు డిపాజిట్ దక్కగా, బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. హైదరాబాద్‌లో బీజేపీ డిపాజిట్ దక్కించుకోగా, కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదు.