650 పేజీల కమిషన్ రిపోర్టుపై..ప్రతి అక్షరానికి సమాధానం ఇస్తా: హరీష్ రావు

650 పేజీల కమిషన్ రిపోర్టుపై..ప్రతి అక్షరానికి సమాధానం ఇస్తా: హరీష్ రావు
  • కమిషన్ రిపోర్టుపై రూల్స్ పాటించలేదు..అందుకే  కోర్టుకు వెళ్లాం:హరీష్ రావు 
  • పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్దంగా జరిగిందా లేదా అనే చర్చించాలి 
  • నిజాలు ప్రజలకు తెలియాలి..
  • కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8B కింద.. నోటీసులు ఇవ్వని ఏ రిపోర్టు అయినా చిత్తుకాగితమే 
  • కాళేశ్వరంపై ఎన్ని రోజులైన చర్చకు సిద్దం 
  • 650 పేజీల నివేదికపై ప్రతి అక్షరానికి సమాధానం చెప్తాను 
  • అరగంట కాదు.. రెండు గంటల సమయం కావాలి 
  • ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు 
  • నిష్పక్షపాక్షికంగా కమిషన్ విచారణ జరిగిందా లేదా 
  • రాజకీయంగా కాంగ్రెస్ కథ నడిపిస్తోంది 
  • నిబంధనలు అనుసరించలేదని మేం కోర్టు కు వెళ్లాం 
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? సర్కస్ కంపెనీ నీ నడుపుతున్నారా? 
  • స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారు 

కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. 650 పేజీల ఘోష్ కమిషన్ రిపోర్టును సభలో చర్చకు పెట్టిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంతో  రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీరుపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రులు బాధ్యత వహించాలని అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు..మాపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని అన్నారు. 

కాళేశ్వరం పై ఘోష్ కమిషన్ తమకు చట్టబద్దంగా నోటీసులు ఇవ్వలేదని.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వకుండా రిపోర్టును ఏకపక్షంగా ఇచ్చిందని ఆరోపించారు హరీషరావు. 8B ప్రకారం నోటీసులు ఇవ్వని ఏ కమిషన్ నివేదిక నిలబడలేదని.. గతంలో జరిగిన కొన్ని కమిషన్ల రిపోర్టులను హరీష్ రావు వివరించారు. 

కాళేశ్వరంపై 650 పేజీల జస్టిష్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సమాధానం ఇవ్వాలంటే అరగంట సమయం సరిపోదు.. కనీసం రెండు గంటల సమయం కావాలని హరీష్ రావు స్పీకర్ ను కోరారు. దీనికి కాంగ్రెస్  సభ్యులు ఒప్పుకోలేదు. 

ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే.. వరదలు వచ్చి పంట నష్టం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కదోవ పట్టించేందుకు కాళేశ్వరం పై చర్చకు పెట్టిందని.. ఎరువులు, వరదలపై సభలో చర్చకు అనుమతివ్వాలని హరీష్ రావు స్పీకర్ కోరారు. అయితే కాళేశ్వరం కమిషన్ పై చర్చ సందర్భంలో ఆ విషయంపైనే మాట్లాడాలని స్పీకర్ నిరాకరించారు. 

కాళేశ్వరంపై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం.. నిష్పక్షపాతంగా కమిషన్ విచారణ జరిగిందా లేదా తేలాలి.. చట్టబద్దంగా  కమిషన్ విచారణ జరగలేదు కాబట్టే మేం కోర్టు వెళ్లాం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ కథ నడిపిస్తోంది.. కోర్టులో వాదనలు ఉన్నాయని ఆదరాబాదరాగా అసెంబ్లీలో రిపోర్టు ఉంచారు..ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కుట్ర అని అర్థం అవుతోందని  విమర్శించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు.. నిబంధనలు అనుసరించలేదనే మేం కోర్టు వెళ్లామన్నారు హరీష్ రావు.