హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తీసుకోవడం వల్లే బండిసంజయ్ కు సైడ్ ఎఫెక్ట్ తో వెంట్రుకలు ఊడిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
బండి సంజయ్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని కౌషిక్ రెడ్డి ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా బండి సంజయ్ ఒక్క రివ్యూ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి ఎజెండానే మాట్లాడుతున్నారని, రేవంత్ నోట ఏ మాట వస్తే సంజయ్ అదే మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో తన భార్య పుస్తెలు అమ్మి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన బండి సంజయ్.. కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారని కౌషిక్ రెడ్డి నిలదీశారు. కేటీఆర్‌ను తిట్టే స్థాయి బండి సంజయ్‌కు లేదని.. దమ్ముంటే సబ్జెక్టుపై, కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కరీంనగర్ సీపీని దద్దమ్మ అని అభివర్ణించిన కౌశిక్ రెడ్డి.. పోలీసులు లా అండ్ ఆర్డర్ మర్చిపోయి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది ఖాలీద్‌ను నడిరోడ్డుపై ఆయుధాలతో బెదిరించినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణను బీహార్‌లా మారుస్తున్నారా అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై కూడా ఇప్పటికే రెక్కీ నిర్వహించారని, అమిత్ షా గారు తెలంగాణ లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని కౌషిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
